TTD News: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవ జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. కాగా, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం: భూమన
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన ప్రతి భక్తుడు స్వామి వారిని కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆయన చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
భక్తులు సమయమనం పాటించాలి: ఈఓ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరగనున్న చక్రస్నానంలో భక్తులు సంయమనంతో వ్యవహరించి విడతలవారీగా పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్భంగా చక్రస్నానం ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. చక్రస్నానం ప్రభావం రోజంతా ఉంటుందని, తమ వంతు వచ్చేవరకు భక్తులు వేచి ఉండి చక్రస్నానం ఆచరించాలని కోరారు. కేరళ నిపుణులు గజరాజులను అదుపు చేసేందుకు వినియోగించే పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
దశావతార నృత్య రూపకం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వ వాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 11 కళాబృందాలలో 288 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో విద్యార్థులు దశావతార నృత్య రూపకంతో అలరించారు. అనంతపురానికి చెందిన బుచ్చిబాబు ఉరుముల భజనతో ఆకట్టుకున్నారు. తిరువనంతపురానికి చెందిన శ్రీమతి బృందం ఆధ్వర్యంలో భరత నాట్యం అత్యంత మనోహరంగా ప్రదర్శించారు.
తిరుపతికి చెందిన చందన బృందం రాజస్థాని నృత్యంతో కనువిందు చేశారు. మహారాష్ట్రకు చెందిన కత్తీకర్ యోగచాప్ విన్యాసాలతో మైమరిపించారు. రాజమండ్రికి చెందిన సురేశ్ బాబు బృందం కోలాట నృత్యాలతో అలరించారు. తిరుపతికి చెందిన ప్రసాద్ బృందం కోలాట భజనలతో మైమరిపించారు. విశాఖపట్నంకు చెందిన భానురేఖ బృందం కూచిపూడి నృత్యాలతో మైమరిపించారు. విశాఖపట్నంకు చెందిన సునీత బృందం కోలాట భజనలతో అలరించారు. టీటీడీ ఉద్యోగుల మహిళలు కృపావతి బృందం ఆధ్వర్యంలో తమ కోలాట నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.