Tirumala Alipiri Metlostavam Celebrations: తిరుపతి: తిరుమలలో త్రైమాసిక మెట్లోత్సవం సంప్రదాయ బద్ధంగా జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు నిలిచిన మెట్లోత్సవం ప్రారంభమైంది. అలిపిరి పాదాల మండపం వద్ద తెల్లవారు జామున మెట్లోత్సవం సంప్రదాయ బద్ధంగా జరిగింది. దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన మెట్ల పూజకు పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. మెట్లకు పూజ చేస్తూ తిరుమల శ్రీనివాసుని దర్శనానికి భక్తులు వెళ్లారు. పురందరదాసు కీర్తనలు ఆలపిస్తూ భక్తులు మెట్లోత్సవం లో భాగస్వాములైయ్యారు. 


నాలుగు దశాబ్దాల నుంచి మెట్లోత్సవం.. 
43 ఏళ్ల కిందట ఏర్పడిన దాస సాహిత్య ప్రాజెక్ట్ గత 35 ఏళ్లుగా మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా జరగని మెట్లోత్సవం తిరిగి ఇవాళ ప్రారంభం అయ్యింది. కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం తిరుగిరుల ప్రత్యేకతని  దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు తెలిపారు. గతంలో పురందరదాసులు, వ్యాస రాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు కాలి నడకన స్వామిని దర్శించి ఆశీస్సులు పొందారని దాససాహిత్యప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు గుర్తు చేశారు.


శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం.. 
తిరుమల శ్రీవారిని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. శ్రీవారి ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో కేంద్ర కార్మికశాఖ మంత్రి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతో రెండు రోజులుగా జరిగిన సమావేశం విజయవంతంగా జరిగినట్లు ఆయన పేర్కోన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన అన్నారు. కార్మికుల కోసం ఏపీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్ర మంత్రి అనుమతించినట్లు మంత్రి జయరాం తెలిపారు.  


శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి..
తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి పువ్వాడ దంపతులకు ఆశీర్వచనం అందించగా,టిటిడి ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.అనంతరం ఆలయం వెలుపల అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.


తిరుమలలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న 69 వేల 12 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29 వేల 195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీకి 4.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.


Also Read: Peddireddy On Chandrababu: ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా? : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి