TTD Instructions to Shop

  
తిరుమల :  తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతోంది. దాదాపు 50 రోజుల వ్యవధిలో తిరుమలలో 3 చిరుతల్ని బంధించారు అటవీశాఖ అధికారులు. మరికొన్ని చిరుతపులులు అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చ్ వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతల సంచారం ట్రాప్ కెమెరాలకు చిక్కింది. తిరుమల స్పెషల్‌ టైప్ కాటేజీల సమీపంలో ఓ ఎలుగుబంటి కెమెరాకు చిక్కింది. దాంతో అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలలో వన్యమృగాల సంచారంపై ఫోకస్ చేసి భక్తులకు భద్రత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.


న‌డ‌క‌మార్గాల్లో దుకాణ‌దారుల‌కు ప‌లు సూచ‌న‌లు..
నడ‌క మార్గాల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌లతో భ‌క్తుల భ‌ద్రత దృష్ట్యా దుకాణదారుల‌కు టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహ‌కుల‌తో ఈవో శుక్రవారం స‌మావేశం నిర్వహించి ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. న‌డ‌క‌మార్గాల్లో విక్రయాల‌కు సంబంధించి అట‌వీ, ఎస్టేట్‌, ఆరోగ్యశాఖ‌ల అధికారుల‌తో పాటు ప‌లువురు భ‌క్తులు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు చెప్పారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్రయించ‌రాద‌ని సూచించారు. భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. 


అన్ని దుకాణాల వ‌ద్ద త‌డి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చెత్తకుండీల్లో వేయాల‌ని, అలా చేయ‌ని వారిపై చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. న‌డ‌క మార్గంలో రోజుకు రెండు నుండి మూడు ట‌న్నుల చెత్త పోగ‌వుతోంద‌ని, వీటిని ఆరోగ్య శాఖ సిబ్బంది క్ర‌మం త‌ప్ప‌కుండా తొల‌గిస్తున్నార‌ని చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సిసికెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధ‌న‌లు త‌ప్పక పాటించాల‌న్నారు. క్రూర‌మృగాల జాడ క‌నిపిస్తే వెంట‌నే తెలిపేందుకు వీలుగా అట‌వీ, ఆరోగ్య‌, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబ‌ర్లు ప్రద‌ర్శిస్తామ‌ని తెలిపారు.


వన్యమృగాలు ట్రాప్ ను ఎలా ఏర్పాటు చేశారంటే..???
అలిపిరి నడక మార్గాల్లో చిన్నారులపై చిరుత దాడి జరిగిన తర్వాత అప్రమత్తమైంది టిటిడి. వన్యమృగాల సంచారం అధికంగా ఉండే ప్రదేశాలను గుర్తించి ట్రాప్ కెమెరాల సహాయంతో వాటి జాడలను గుర్తించి అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో 2 చిరుతలను బంధించి ఎస్వీ జూపార్క్ కు తరలించారు. కానీ శ్రీశైలం నుండి నలభై మంది అటవీ శాఖ నిపుణులను తిరుమలకు తీసుకొచ్చిన టిటిడి వారి సలహాలు, సూచనలతో మరికొన్ని ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ట్రాప్ లను ఏర్పాటు చేశారు. 
అలిపిరి నడక మార్గంలో 3 ట్యాపులను ఏర్పాటు చేయగా, శ్రీవారి మెట్టు మార్గంలో 100 డ్రాపులను ఏర్పాటు చేశారు. నడక మార్గంకు సమీపంగా వన్యమృగాలు జాడలను ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ప్రదేశాల్లో ట్రాప్లను ఏర్పాటు చేస్తున్నారు. వన్యమృగాలు నడక మార్గాల్లో ఘాట్ రోడ్లలో ఎందుకు సంచరిస్తున్నాయి అనే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వన్యమృగాలను బంధించేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఆత్యాధునికంగా తయారు చేసిన దాదాపు ఆరు ట్రాప్ బోన్ లను, నాలుగు వలలను టిటిడి తిరుమలకు తెప్పించింది. వీటిని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, భక్తుల భధ్రత దృష్ట్యా మరింత ప్రతిష్ట చర్యలను తీసుకుంటుంది.