Tomato Price Hike: తగ్గేదేలే- అనంతపురంలో టమాటా ఆల్ టైమ్ రికార్డ్ - కిలో 213 రూపాయలా!

Tomato Price Hike: అనంతపురం టమాటా మార్కెట్ లో రైతులకు అదిరిపోయే రికార్డు స్థాయి ధరలు లభించాయి. కిలో టమాటాలు 213 రూపాయలకు కిలోగా ధర పలికాయి.  

Continues below advertisement

Tomato Price Hike: రోజురోజుకూ టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో వంద వరకూ పలికిన టమాటా ధర ఏకంగా కిలో రెండు వందలు దాటేసింది. ముఖ్యంగా అనంతపురం టమాటా మార్కెట్ లో రైతులకు రికార్డు స్థాయి ధరలు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 15 కిలోల టమాటా పెట్టె ధర రూ.3200 రూపాయలు పలికింది. ఏటా వర్షాభావంతో, అకాల వర్షాలతో, మార్కెట్ లో ధరలు పతనమై నష్టపోతున్న ఈసారి రికార్డు స్థాయి ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వారి ఊహించిన ధరకంటే 40 శాతం వరకు అధికంగా వస్తుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతపురం టమాటా మండీలో నాణ్యత లేని టమాటా 15 కిలోల బాక్సు కనిష్టంగా 1600 ధర పలకగా, గరిష్టంగా 3200 రూపాయలతో రికార్డు నమోదు అయింది. 

Continues below advertisement

తమిళనాడులో కిలో రూ.250 కన్ఫార్మ్..!

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటల్లో వాడే నిత్యావసర సరుకు టమాటా ధర ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ దాటింది. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.200 మార్క్ చేరుకుంది. తాజాగా తమిళనాడులోనూ కేజీ టమాటా ధర రూ.200కు చేరింది. రాజధాని చెన్నైలోని కొన్ని హోల్‌సేల్‌ మార్కెట్లలో నాణ్యమైన టమాటాను రూ.180 నుంచి రూ.200 రేటుకు విక్రయిస్తున్నారు. త్వరలోనే తమిళనాడులో టమాటా కేజీ ధర రూ.250 మార్క్ చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.200 పలికింది. అయితే టమాటా ధర డబుల్ సెంచరీ మార్క్ చేయడం ఇదే తొలిసారి అని మార్కెట్‌ వ్యాపారుల సంఘం కార్యదర్శి సుకుమారన్‌ తెలిపారు. చెన్నైలోని కొన్ని హోల్‌సేల్‌ మార్కెట్లలో నాణ్యమైన టమాటా కిలో రూ.185 పలకగా, గరిష్టంగా రూ.200 ధరకు చేరడంతో తమిళ ప్రజలు సైతం టమాటా కష్టాలను ఎదుర్కొంటున్నారు. 

మధురై, కోయంబత్తూర్ లలో నాణ్యమైన టమాటా కేజీ ధర రూ.170కు చేరింది. ఇక్కడ సైతం త్వరలోనే రూ.200 మార్క్ చేరుతుందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. వర్షాలు మొదలైన కొన్ని రోజులకు టమాటా ధరలు దిగి రానున్నాయని తాము భావించామని, కానీ టమాటాలు రికార్డు ధరకు చేరి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. కోయంబేడు మార్కెట్ కు సగటున 1200 టన్నుల టమాటా వస్తుంది. కానీ గత కొన్ని రోజులనుంచి దినసరి 300 టన్నుల టమాటా మార్కెట్ కు వస్తుందని, దాంతో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని ఓ వ్యాపారి తెలిపారు. 

తమిళనాడులో శని, ఆదివారాల్లో పలు పట్టణాల్లో రూ.150 నుంచి రూ.170 మధ్య ధర పలికిన టమాటా ఇప్పుడు రూ.200 మార్కు చేరింది. మార్కెట్లకు టమాటా ఇలాగే తక్కువగా వస్తే, ఈ ధరు రూ.250 దాటే ఛాన్స్ ఉంది. తిరుచ్చిలోని గాంధీ మార్కెట్ కు సైతం టమాటా తక్కువగా రావడంతో సరుకు రకాన్ని బట్టి కేజీ ధర రూ.140 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మధురైలోనూ టమాటా ధరలు రూ.160 నుంచి రెండు వందల వరకు ధర రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ సామాన్యులు టమాటా వినియోగం తగ్గించారు. కొందరైతే రేట్లకు భయపడి కొన్ని రోజుల నుంచి టమాటా వాడకం సైతం మానేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం టమాటా లేకుండా బర్గర్, ఇతర ఐటమ్స్ సర్వ్ చేయడం మొదలుపెట్టాయి. 

Continues below advertisement