Tirumala News: ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల క్రితం మొదలైన తిరుపతి లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంపై ఏదో రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. రెండు రోజుల్లో ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోనున్నారు. అంత కంటే ముందే తిరుమల వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చుట్టూ వివాదం నడుస్తోంది. ఆయన పర్యటన అడ్డుకుంటామని కొందరు స్వామీజీలు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు కూడా ఆయన పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చాలా హాట్ హాట్‌గా ఉన్న టైంలో తిరుపతి వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులోకి తీసుకొచ్చారు పోలీసులు.
ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్న టైంలో తిరుపతిలో ఎన్డీఏ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. జగన్ పర్యటన, తిరుపతి లడ్డూ వివాదంపై చర్చించారు. ఈ సమావేశంలో చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు తెలిపారు. అయితే చివరకు జగన్ పర్యటన అడ్డుకోవద్దని నేతలు నిర్ణయించారు. ఆయన పర్యటించే రూట్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని తేల్చారు. లడ్డూ కల్తీకి జగన్ మాత్రమే కారణమని చెప్పాలని అభిప్రాయపడ్డారు,
వైసీపీ రాజకీయ బలప్రదర్శన చేస్తే మాత్రం ధీటుగా సమాధానం చెప్పాలని కూటమి నేతలు నిర్ణయించారు. పరమ పవిత్రమైన లడ్డూ కల్తీ చేసిన జగన్‌కు తిరుమల సందర్శించే అర్హత లేదని విమర్శించారు కూటమి నేతలు. అందుకే జగన్ పర్యటించిన ప్రాంతంలో లడ్డూ కారకుడైన జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపాలని తీర్మానించారు.
ఎన్డీఏ కూటమి నేతల నిర్ణయంతో పరిస్థితి మరింత హాట్‌గా మారింది. ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ జగన్‌పై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయం టీటీడీకి సంబంధించిన విషయమని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. డిక్లరేషన్ విషయంపై ఎవరూ కలుగుజేసుకోవద్దని టీటీడీ చూసుకుంటుందన్నారు. అప్పటి నుంచి వేరే ఎవరూ మాట్లాడటం లేదు.
Also Read: తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం? జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?