Tirumala Srivari Brahmotsavam 2023 Dates:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతాయి, కానీ అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మరోవైపు పురటాసి మాసం కూడా వస్తున్నందున తిరుమలకు భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. అన్నివిభాగాల అధికారులు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. మొదట సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అదేవిధంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించినట్లు చెప్పారు. 15 రోజుల తరువాత జిల్లా అధికారులతో టీటీడీ సమీక్ష నిర్వహించనుందని తెలిపారు.
వార్షిక బ్రహోత్సవాల షెడ్యూల్ వివరాలు..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 19వ తేదీన గరుడ వాహనం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. శ్రీవారి అన్నప్రసాదం, ఇంజినీరింగ్ పనులు, దర్శనం, కళ్యాణకట్ట, రవాణా, వసతి, పోలీసు, వైద్యం, ఆరోగ్యం, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిగింది.
పురటాసి మాసం, రెండు బ్రహ్మోత్సవాలు ఉన్నందున తిరుమలకు ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. పురటాసి పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగియనుంది. సెప్టెంబరు 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
ఆగస్ట్ 18, 19వ తేదీల్లో కరెన్సీ కట్ నోట్స్ ఈ - వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 31 దేశాలకు చెందిన 24,583 చిరిగిన కరెన్సీ నోట్లను ఆగష్టు 18,19వ తేదీల్లో ఈ - వేలం వేయనున్నారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నెంబర్లో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in లో సంప్రదించాలని టీటీడీ సూచించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial