తిరుమల : కలియుగ దైవం తిరుమలేశుడి సన్నిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో‌ నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య హెచ్చరించారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీడీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. 


తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వద్ద స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇక ఘాట్ రోడ్డులో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని తిరుపతి అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు.


తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల‌ రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడు కొండలకు క్యూ కడుతున్నారు. సోమవారం రోజున 78 వేల 126 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 37 వేల 597 మంది తలనీలాలు సమర్పించగా.. 3.74 కోట్ల రూపాయలు హుండీ ద్వారా భక్తులు కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి బయట టీబీసీ వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో‌ టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుంది. 


శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని సేవించారు. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహించారు.