TTD Governing Council Key Decisions: తిరుపతి : సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాంమని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన చేత తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించాంమని, రెండో విడతలో శ్రీవాణి ట్రస్టు నిధులతో దశలవారీగా ఆలయాల నిర్మాణం చేపడతాంమన్నారు. ఈ ఆలయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమరసత సేవ ఫౌండేషన్‌తో పాటు దేవాదాయశాఖ ద్వారా, ఆయా జిల్లా యంత్రాంగాల ద్వారా నిర్మించేందుకు చర్యలు చేపడతాంమని తెలియజేశారు.
బ్రేక్ దర్శనం వేళల్లో మార్పు..
డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రారంభిస్తామని, ఒక నెల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాంమన్నారు. తిరుపతిలోని మాధవంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు, గదులు కేటాయించడం జరుగుతుందన్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తాంమని, పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాంమని, ఇందుకోసం రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా రోజుకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేస్తాంమని ఆయన వెల్లడించారు. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబడరని తెలియజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాంమని, 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాంమన్నారు. ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుందని, తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని వినియోగిస్తాంమని, బంగారు తాపడం పనుల కోసం 1957-58 సంవత్సరంలో టీటీడీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తాంమని ఆయన వెల్లడించారు. అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశాంమని, త్వరలో మొదటి దశ టెండర్లను పిలవడం జరుగుతుందని ప్రకటించారు.
టిటిడిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఈఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాంమని, వచ్చే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని నందకం విశ్రాంతి గృహంలో మంచాలు తదితర ఫర్నీచర్ కొనుగోలుకు రూ.2.95 కోట్లు మంజూరు చేసాంమని, తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9.05 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపాంమన్నారు.
తిరుమల బాలాజి నగర్ ప్రాంతంలో అంతర్గత రోడ్లు, పార్కింగ్ ప్రదేశం, మురుగుకాల్వల నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద గదుల ఆధునీకరణ ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.3.80 కోట్లు మంజూరు చేసాంమని, అదే విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను రాష్ట్ర రైతు సాధికార సంస్థ సహకారంతో ఎపి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఆమోదించడం జరిగిందన్నారు. జమ్మూలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పలు అభివృద్ధి పనులు, వసతులు కల్పించేందుకు గాను 10 రకాల పనులను రూ.7 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపాంమన్న ఆయన, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో బాలుర హాస్టల్ భవనంలో అదనపు అంతస్తు నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు చేసాంమని వెల్లడించారు.
టిటిడి ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు గాను మందుల కొనుగోలుకు రూ.2.56 కోట్లు, సర్జికల్ సామగ్రి కొనుగోలుకు రూ.36 లక్షలు మంజూరు చేసాంమని, తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.3.75 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. టిటిడిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 2022 శ్రీవారి బ్రహ్మోత్సవ బహుమానం చెల్లింపునకు ఆమోదం తెలిపాంమని, టిటిడిలో 7 వేల మంది రెగ్యులర్, 14 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
రెగ్యులర్ ఉద్యోగులకు - 14000/, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు - 6850/-కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవని మరో పది రోజుల్లో నూతన సిబ్బంది ద్వారా లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.