Tirumala Laddu Adulteration | తిరుమల: తిరుమల లడ్డూ కల్తీ అంశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (TTD EO) అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులలో ఆదేశించారు.
అనిల్ కుమార్ సింఘాల్ 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలోనూ ఆయన టీటీడీ ఈవోగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2017 మే 6 నుండి 2020 అక్టోబర్ 4 వరకు మొదటి విడతలో టీడీపీ, వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను రెండోసారి టీటీడీ ఈవోగా నియమించడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో అనిల్ సింఘాల్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టీటీడీ పాలనలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో ఆయన టీటీడీ ఈవోగా చేయడం, ఆ సమయంలో లడ్డూ కల్తీ ఆరోపణలతో అనిల్ సింఘాల్‌ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీపై ప్రత్యేక విచారణ బృందం (SIT) ఇటీవల తన తుది నివేదికను (ఛార్జ్ షీట్) సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది.
సిట్ నివేదికలోని ముఖ్యాంశాలు
సిట్ తన ఛార్జ్ షీట్‌లో తిరుమలకు నెయ్యి సరఫరాలో భారీ అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా రూ. 250 కోట్ల కుంభకోణం జరిగిందని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీతో పాటు ఇతర కంపెనీలు నకిలీ సీల్స్, తప్పుడు ల్యాబ్ రిపోర్టులతో టీటీడీని మోసం చేసినట్లు గుర్తించింది. అయితే, తాజా నివేదికలో జంతువుల కొవ్వు (Animal Fat) ఆనవాళ్లు లేవని పేర్కొంది. కానీ పామాయిల్, కెమికల్ ఎస్టర్స్ వంటి ఇతర పదార్థాలతో నెయ్యిని కల్తీ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు రావడంతో చర్చ మొదలైంది.
టీడీపీ vs వైసీపీ మాటల యుద్ధం
టీడీపీ ఆరోపణలు
గత వైసీపీ ప్రభుత్వం కావాలనే నిబంధనలు సడలించి, తమకు అనుకూలమైన డెయిరీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఎన్డీడీబీ (NDDB) నివేదికను గుర్తు చేస్తూ, సిట్ నివేదిక కల్తీని ధృవీకరించిందని, ఇది ముమ్మాటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్
సిట్ నివేదికలో జంతు కొవ్వు లేదని తేలడంతో వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడిని వాడుకున్నారని, అబద్ధపు ప్రచారంతో భక్తులను అయోమయానికి గురిచేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. క్లీన్ చిట్ లభించిందని వైసీపీ నేతలు వాదిస్తుంటే, కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పిందని టీడీపీ సహా కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో, అసలు దోషులు ఎవరో తేల్చి కఠిన శిక్ష వేయాలని భక్తులు కోరుకుంటున్నారు.