తిరుమల: కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శుక్రవారం రాత్రి భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని... భక్తులకు సౌకర్యాలు కల్పించాలి, అధికారులు రావాలి అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భక్తులు అర్థరాత్రి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులతో కలిసి సర్వదర్శనం క్యూ లైన్లు పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. 

భక్తుల సమస్యలపై స్పందించిన వైఎస్సార్‌సీపీతిరుమల క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి, నరకయాతన అనుభవిస్తున్న భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకుందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. డౌన్ డౌన్ టీటీడీ ఈవో శ్యామలరావు , “డౌన్ డౌన్ ఛైర్మన్ బీఆర్ నాయుడు” అంటూ నినాదాలు చేశారంటే ఆ భక్తుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.

శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు అన్నప్రసాదం, పిల్లలకు పాలు, మంచి నీరు లేక అల్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ దర్శనాలతో బిజీగా ఉన్న ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను వైసీపీ ప్రశ్నించింది.

తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

వేసవి సెలవులు కావడం, అందులోనూ చల్లని వాతావరణం కావడంతో గత కొన్నిరోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. కొన్ని రోజుల్లో స్కూల్స్, కాలేజీలు రీఓపెన్ కానున్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తిరుమలకు వెళ్తున్నారు. పరీక్షల ఫలితాలు రావడం, వేసవి ప్రభావం తగ్గడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ 80, 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామి వారి హుండీకి రూ.5 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. తిరుమలకు వెళ్తున్న భక్తులు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భక్తులు ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో భక్తులకు సరైన వసతులు కల్పించలేదని, అన్న ప్రసాదం, చిన్న పిల్లలకు పాలు అందడం లేదని ఆరోపిస్తూ భక్తులు టీటీడీ ఛైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.