TDP Protes: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సంతే బిదునూరు గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా హిందూపురం బెంగళూరు ప్రధాన రోడ్డుపై నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హిందూపురం రూరల్ సీఐ జీటీ నాయుడు లాఠీకి పని చెప్పి వారిని చెదరగొట్టారు. నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ ఛార్జ్ చేయడం ఉద్దేశమేంటని టీడీపీ శ్రేణులు పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.


గోరంట్ల గో బ్యాక్ అంటూ నినాదాలు.. 
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై గత వారం రోజులుగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూపురంలో నిరసనలు జరుగుతున్నాయి. సోమవారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. మండలంలోని చౌలూరు గ్రామంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే జాతీయ జెండాను ఆవిష్కరించి పలు విషయాల గురించి మాట్లాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఇటీవల ఎంపీ చేసిన వికృతి చేష్టలపై సంతే బిదనూరు గేటు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గోరంట్ల మాధవ్ గో బ్యాక్.. గోరంట్ల మాధవ్ గో బ్యాక్.. అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాసలీల గోరంట్ల మాధవ్ హిందూపురానికి రాకూడదంటూ కామెంట్లు చేశారు. వెంటనే అతని పదవికి రాజీనామా చేయాలని టీడీపీ మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.


వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం.. 
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నాయకులు గోపి కృష్ణ, వైకాపా శ్రేణులను వెంట బెట్టుకొని అక్కడికి వెళ్లారు. ధర్నా ఆపాలంటూ టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య గొడవ అంతకంతకూ పెరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హుటాహుటినా రంగంలోకి దిగి.. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. కొందరు అప్పటికీ ధర్నా కొనసాగించడంతో హిందూపురం రూరల్ సీఐ జీటీ నాయుడు లాఠీకి పని చెప్పారు. అయినా వినని కొందరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు  చెందిన అభ్యంతరకర వీడియో వైరల్ అయింది. అందులో ఆయన, చొక్కా లేకుండా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన న్యూడ్ కాల్ మాట్లాడారు అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. టీడీపీ నేతలు ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్ఫింగ్ వీడియోలను టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారని చెప్పారు.


తాను జిమ్ లో ఉండగా ఆ వీడియో తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఆరోపించారు. దీనిపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. అంతే కాకుండా మార్ఫింగ్ వీడియోపై ఫోరెన్సిక్‌ టెస్టుకైనా సిద్ధమని అన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్‌ చేశారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలని అన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.