ఇన్ని రోజులు పరదాలు కట్టుకొని తిరిగిన వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఎన్నికల టైంలో జనం బాట పడుతున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పీలేరులో నిర్వహించిన రా... కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్‌పై ఆ పార్టీ లీడర్లు చేస్తున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పెయిరీ డేట్‌ దగ్గర పడిందని చంద్రబాబు అన్నారు. ప్రజాకోర్టులో జగన్‌కు శిక్ష పడే సమయం రానే వచ్చిందని అన్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని కసిగా మార్చి ఓటు రూపంలో బుద్ది చెప్పాలన్నారు. 


ఇన్ని రోజులపాటు ప్రజలకు దూరంగా ఉంటూ పరదాలు కట్టుకొని తిరుగుతూ వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సిద్ధం అంటున్నారని అన్నారు. తాము కూడా యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు చంద్రబాబు. ఎన్నికల బరిలో టీడీపీ జనసేన దూసుకెళ్తాయని కచ్చితంగా వైసీపీ జెండా పీకేయడం ఖాయమని అభిప్రాయపడ్డారు. 


చంద్రబాబు. నాయకులపై కూడా జగనన్‌కు నమ్మకం లేదని... అందుకే ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను మార్చిస్తున్నారని.. ఇప్పుడు వారు కూడా పోటీ చేయలేమని పారిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయిన జగన్‌... ప్రజలను కూడా సరిగా పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు.


పాలన చేతకాకపోవడం ఒక ఎత్తైతే... అబద్దాలు చెప్పడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని మండిపడ్డారు చంద్రబాబు. సాగు నీటి ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదని అన్నారు. ప్రజలకి కూడా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి  పాలనకు అనర్హుడని... అందుకే జగన్‌ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.