Pawan Kalyan News: శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Srikalahasti Giri Pradakshina Road | తమిళనాడులోని అరుణాచలంలో తరహాలోనే శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ చేయాలని తనకు ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

అమరావతి: పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కావని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో గిరిప్రదర్శన చేయాలని ఉందన్న పవన్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలన్నారు. అరుణాచలంలో మాదిరిగా శ్రీకాళహస్తిలో కూడా గిరిప్రదక్షణ చేయాలని తనకు కోరిక ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయాలు నిర్మించాలన్న మంత్రి సంకల్పాన్ని ఆయన అభినందించారు.

ఏపీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రూ. 10 కోట్లు వెచ్చించి నిర్మించిన 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ వివరించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్గానికి ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మార్గ నిర్దేశకత్వంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు రూ. 3.70 కోట్లు, కోటప్పకొండ పరిసరాల రోడ్లకు రూ. 4 కోట్లు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 6 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ. 40 కోట్లతో 22 ప్రధాన దేవాలయాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా కైలాసగిరి ప్రదక్షణ నిర్వహించాలని నూతన ట్రస్ట్ బోర్డుకు సూచించారు.
























