Nara Bhuvaneshwari Funny Comments on Chandrababu Naidu: నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు. ఆమె యాత్ర ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. తన భర్త చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని అన్నారు. ఆయన గత 35 ఏళ్లుగా ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని.. అందుకని ఆయనకు విశ్రాంతి ఇచ్చి ఈసారి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అక్కడున్న ప్రజలు అంతా కేరింతలు కొట్టారు. 


చంద్రబాబు మీకు ఎమ్మెల్యేగా ఉండాలనుకునేవారు చేతులు ఎత్తండి అని కోరగా.. అందరూ చేతులు ఎత్తారు. తాను ఎమ్మెల్యేగా ఉండాలనుకునే వారు చేతులు ఎత్తాలని కోరినా కూడా అందరూ చేతులు ఎత్తారు. దీంతో ఆమె ఎవరైనా ఒకరికే ఛాన్స్ ఉంటుంది కదా.. ఎలా.. అని మాట్లాడారు. తాను ఈ వ్యాఖ్యలు ఊరికే సరదాగా చేశానని అన్నారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని.. తమ కంపెనీలను చూసుకుంటున్నానని అన్నారు. తాను చంద్రబాబు వల్ల సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఎప్పుడూ సీరియస్ వ్యాఖ్యలు చేయకుండా.. ఊరికే ఇలాంటి సరదా వ్యాఖ్యలు చేశానని భువనేశ్వరి చెప్పారు.


నిజం గెలవాలి యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార పార్టీ వల్ల వేధింపులకు గురైన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది అక్టోబరు 10న వెంకటేష్ అనే వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి వెంకటేష్ కు ఉన్న ముగ్గురు పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని భువనేశ్వరి ప్రకటించారు.