టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపరంగా పోరాడుతానని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆదివారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ... బండారు లాంటి చీడపురుగులను ఏరి పారేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశం మహిళలను ఒక్క మాట అనాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలన్నారు. తనను అన్ని మాటలు అన్న రోజునే తన భర్తను చెప్పుతో కొట్టి ఉంటే మరోసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుందని బండారు భార్యను అడిగారు. 


" మహిళలను కించపరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? టీడీపీ ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడానినే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనలకు దిగజారుడు రాజకీయాలే తెలుసు". అంటూ రోజా మండిపడ్డారు. 


" మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి చాలా నీచంగా మాట్లాడారు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి ఎవరు ఇంతలా మహిళల గురించి మాట్లాడలేదు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు, తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తాడో అర్థమైంది. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారం ఏమిటో తెలుస్తోంది. మంత్రిగా ఉన్న రోజని అంటే తప్పించుకొని తిరుగొచ్చు అని అనుకుంటున్నాడు. బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికి నేను పోరాటం చేస్తున్నా. అరెస్టు చేసి బెయిల్ వస్తే బండారు తప్పు చేయనట్లు కాదు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల మేము చాలా అవమానపడ్డాం. చట్టాల్లో మార్పు రావాలి. టీడీపీ, జనసేన ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేసేందుకే" అని ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. 


టీటీడీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు.  మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు. 


చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, జైల్లో ఆయన దీక్ష చేయడమంటే గాంధీజీను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు. 


బండారు సత్యనారాయణ చేసిన వాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ నిలదీశారు. టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి  జనాలు ముందుకు రాలేదని విమర్శించారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.