Madanapalle Kidney Scam: కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
Madanapalle Kidney Case: పేదల అవయవాలే పెట్టుబడిగా చేస్తున్న మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Madanapalle Kidney Scam: మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిరుపేదల అవయవాలే లక్ష్యంగా వ్యాపారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కిడ్నీలతో వ్యాపారం చేస్తున్న నిందితులపై నిఘా పెట్టారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ రాకెట్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు, కిడ్నీ మార్పిడి చేసిన గ్లోబల్ ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆంజనేయులు, కిడ్నీ వ్యాపారంలో బ్రోకర్లుగా వ్యవహరించిన సత్య, పద్మ, మదనపల్లె డయాలసిస్ కేంద్రం మేనేజర్ మెహారాజ్, కదిరి డయాలసిస్ సెంటర్ మేనేజర్ బాలరంగడు, మృతురాలి స్నేహితుడు సూరిబాబు ఉన్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.
డబ్బుల ఆశ చూపి కిడ్నీలు లేపేస్తారు..
విశాఖపట్నానికి చెందిన యమునకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దాంతో పిల్లి పద్మ, సత్యలు ఆమెకు కిడ్నీ మార్పిడి ట్రీట్మెంట్ గురించి చెప్పారు. ఈ క్రమంలో నవంబర్ 9న యమునకు మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేశారు. నవంబర్ 10న ఆమె చనిపోయింది. దీనిపై యమున తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించగా, వారిలో ఆరుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల గాలింపు కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు
ఈ పోలీసు బృందాలు ఏపీతో పాటు కర్ణాటక, గోవా, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ కిడ్నీ రాకెట్ కేసులో బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. అలాగే, రాకెట్ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.






















