Madanapalle Accused Suicide: మదనపల్లె చిన్నారి ఘటన.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య!
మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను డ్రమ్ము నీళ్లలో ముంచి హత్య చేసిన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Madanapalle Girl Incident | మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన నిందితుడు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. బుధవారం ఉదయం కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక పరిశీలన అనంతరం, మరణించిన వ్యక్తి మదనపల్లి ఘటనలో నిందితుడు కులవర్ధన్ అని పోలీసులు భావిస్తున్నారు. బాలిక హత్యాచారం ఘటనలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కనసానివారిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
అత్యాచారం చేసి, నీళ్లలో ముంచి బాలిక హత్య
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న అమానుష ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి డాక్టర్లు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ తర్వాత చిన్నారి భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వైద్య పరీక్షలు, పోలీసు దర్యాప్తులో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, ఆపై పాపను నీళ్ల డ్రమ్ములో ముంచి ఊపిరాడకుండా చేసి
హత్య చేశాడని నిర్ధారణ అయ్యింది.
అసలేం జరిగిందంటే..
మదనపల్లెకి చెందిన 7 ఏళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. సోమవారం (ఫిబ్రవరి 16న) స్కూల్‌కు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఉన్నది. మరోవైపు తల్లి పనికి వెళ్లింది. బాలిక ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం 4.30 గంటలకు తల్లి ఇంటికి ఫోన్ అడగగా చిన్నారి ఇంట్లో లేదని, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి ఉంటుందని భావించారు. ఎంతకు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీం రంగంలోకి గాలింపు చేపట్టింది. స్థానికంగా ఎవరూ తెలియదని చెప్పడంతో చివరికి బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ ఇల్లు రాత్రి 1.30 గంటలకు గాలించడానికి వెళ్లారు. ఎంత తలుపుకొట్టినా కులవర్ధన్ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూస్తే నిద్రపోతున్నట్లు కనిపించాడు. బాలిక తాత మాత్రం చివరగా కులవర్ధన్‌తోనే బాలిక కనిపించిందని చెప్పడంతో మంగళవారం ఉదయం మళ్లీ అతడి ఇంటికి వెళ్లి చూడగా దారుణం వెలుగు చూసింది. డ్రమ్ములో బాలిక మృతదేహమై ఉండటాన్ని గుర్తించి అంతా షాకయ్యారు.
























