Chittoor News: పెద్దిరెడ్డిని కాదని కరుణాకర్‌రెడ్డికి జై కొట్టిన జగన్- అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
YSRCP News: క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం దిశా వైసీపీ చర్యలు చేపట్టింది. జిల్లా అధ్యక్షులను సీనియర్లను నియమిస్తోంది. అయితే చిత్తూరు అధ్యక్ష నియామకం మాత్రం కాస్త సంచలనమే అని చెప్పొచ్చు

Tirupati News: 151 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ దేశంలో రికార్డు కెక్కింది. నాడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ని చూసి ఓట్లు వేశారు. 5 ఏళ్ల కాలంలో చేసుకున్న స్వయంకృతాపరాధాలతో ఎంత ఎత్తుకు ఎదిగిందో అంత కంటే రెట్టింపు వేగంతో పతనమైంది. 151 సీట్లు నుంచి 11 సీట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత వైసీపీ బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్. పార్టీని నమ్ముకున్న వారికి కీలక పదవులు ఇస్తూ బలోపేతానికి కృషి చేస్తుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు
మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టారు. వాస్తవానికి గడిచిని 5ఏళ్ల కాలంలో నాలుగేళ్ల పాటు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన కరుణాకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. చివరి అవకాశంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏడాది కాలానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అసలే పార్టీ నేతలపై వ్యతిరేకంగా ఉన్న తిరుపతి ప్రజలకు ఏమి చేయలేదని అపవాదు కూడా మూటకట్టుకున్నారు.
స్థానిక ఎన్నికల నుంచి కోఆపరేటివ్ ఎన్నికల వరకు చేసిన తప్పిదాలు ప్రజలను ఆలోచించేలా చేశాయి. 2009లో జగన్‌ను చూసి వేసిన ఓట్లు 2024 ఎన్నికల్లో ఆయనను చూసే ఓడించారనేది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో సైతం టీటీడీ చైర్మన్‌గా, ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్‌గా ఉండి ఓటమి చెందారు. ఎన్నికల సమరం ముగిసిందని చాలా మంది పార్టీ నాయకులు నుంచి క్యాడెర్ వరకు బయటకు రావడం లేదు. వీరందరిని బయటకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా పార్టీ బలోపేతానికి జిల్లా అధ్యక్షుడిని నియమించింది వైసీపీ.
పెద్దిరెడ్డి లేని సభ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు వైసీపీలో రెండో సీఎం అనే వాళ్లు ఉన్నారు. చాల వరకు పార్టీకి అన్ని రకాలుగా ఆవిర్భావం నుంచి కూడా వెన్నుదండుగా నిలిచారు. పార్టీ ఏ చిన్న కార్యక్రమమైనా ఆయన తప్పక హాజరై అన్ని తానై నడిపించే వ్యక్తి. రాయలసీమలో పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నాయకులు నుంచి అధికారుల వరకు నడిపిన వ్యక్తి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో కనిపించలేదు. అక్కడికి వచ్చిన చాలా మంది పెద్దిరెడ్డి లేకపోవడాన్ని రకరకాలుగా చర్చించుకున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తొలుత అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి, మాజీ మంత్రి రోజాకు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. చాల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం వారిని సత్కరించారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని అందుకే పెద్దిరెడ్డిని తప్పించి కరుణాకర్ రెడ్డికి అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర స్థాయి నాయకుడికి జిల్లా స్థాయి పదవి ఇవ్వడం వెనుక పక్కకు పెట్టే ప్రయత్నమా అనేది కూడా చర్చ నడుస్తోంది. కరుణాకర్ రెడ్డికి పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చిన తరువాత పెద్దిరెడ్డి ఆయనను ఒక్కసారి కలిశారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారంలో పెద్దిరెడ్డి లేకపోవడంతో పెద్దిరెడ్డికి ఇచ్చిన పదవి తీసి వేయడంపై ఆయన వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం
రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే సైతం చేయని విధంగా వైఎస్సార్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగింది. బస్సులు పెట్టి మనిషికి రూ. 300, భోజనం పెట్టి ప్రమాణ స్వీకారానికి జనసమీకరణ చేశారట. పార్టీ అధినేత జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా పార్టీ ప్రధాన నాయకులు అందరూ ఈ సభకు హాజరైయ్యారు. సభలో కూడా పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తామని కాకుండా కూటమి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా మాట్లాడారు.
సభకు వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు సైతం ఇంత ఆర్భాటం ఏంటి అనేలా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే పార్టీ నాయకులు కార్యకర్తలు ఇకనైన ప్రజల సమస్యలపై పోరాటానికి రోడ్డుపైకి వస్తారా లేక గతంలో మాట్లాడిన తీరులో ఉంటారా అనేది మాత్రం ఎదురుచూడాల్సిందే.
Also Read: తిరుచానూరులో తీవ్ర విషాదం - క్రాస్ వీల్ విరిగి మహిళ మృతి