TTD News: తిరుమలకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తూకంలో తేడా ఉన్నట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై పెను దుమారం రేగుతుండటంతో చివరకు టీటీడీ స్పందించాల్సి వచ్చింది.
శ్రీవారి లడ్డులంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండారు. రోజుకి లక్ష మేర భక్తులు తిరుమలకు వస్తుంటే, లడ్డులు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మేర విక్రయిస్తుంది టీటీడీ. దీని బట్టే అర్థం అవుతుంది లడ్డులకు ఉన్న డిమాండ్ ఎటువంటిదో. శ్రీవారికి నిత్యం వివిధ రకాల ప్రసాదాలను నివేదన చేస్తుంటారు ఆలయ అర్చకులు. శ్రీవారికి త్రికాల నైవేధ్యం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ప్రత్యేక పద్దతుల ద్వారా స్వామి వారికి ప్రసాదాలు తాయారు చేసి నివేదిస్తుంటారు. ప్రసాదంలో అన్నింటికన్నా భక్తులు మహా ప్రసాదంగా భావించేది లడ్డులు. తిరుపతి అంటే వెంకన్న ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డూ కూడా అంతే ఫేమస్. మాన్యులు, సామాన్య భక్తులు విరివిగా తీసుకొనే ప్రోక్తం లడ్డులను రోజుకి 3 నుంచి 4 లక్షలు తయారు చేస్తుంటారు.
70 గ్రాములు తక్కువ వచ్చిందంటూ భక్తుడి ఆరోపణ..
ఒక్కో లడ్డు బరువు సుమారు 165 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు ఉంటుంది. నిన్న సునీల్ కుమార్ అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి స్వామి వారి దర్శనం అనంతరం ప్రోక్తం లడ్డులను కొనుగోలు చేసాడు. అదే సమయంలో లడ్డులా పరిమాణం తక్కువగా ఉందని గుర్తించాడు. వెంటనే కౌంటర్ వద్ద ఉన్న వెయింగ్ మిషన్ లో తూకం వేశాడు. ఒక్కో లడ్డు పరిమాణం 98 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న మొబైల్ లో లడ్డులకు సంబంధించిన వీడియో చిత్రీకరించాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అంతర్గతంగా విచారణ చేపట్టారు టీటీడీ అధికారులు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు..
విచారణ చేసిన అధికారులు.. ఎక్కడా సిబ్బంది లోపం లేదని తేలినట్లు వెల్లడించారు. చేతితో తయారు చేసే లడ్డులను సాధారణంగా తూకం వేయరు. లడ్డును పట్టిన వెంటనే పెద్ద పెద్ద ట్రేల ద్వారా లడ్డు కౌంటర్లకు పంపుతారు. లడ్డు బరువులో ఏదైన లోపం ఉంటే వెయింగ్ మిషన్ లో లడ్డు పరిమాణం తెలుసుకోవచ్చు. భక్తుడు లడ్డు పరిమాణం తూకం వేసే సమయంలో వెయింగ్ మిషన్ బరువు -70 గ్రాములుగా ఉంది. సాంకేతిక లోపం తలెత్తడం... దానిని మార్చలేక పోవడంతో కొన్నాళ్లుగా మైనస్ 70 గ్రాముల బరువు అలాగే ఉండిపోయింది. సుమారు 170 గ్రాములు ఉన్న ప్రోక్తం లడ్డు 98 గ్రాములు, 108 గ్రాములుగా చూపించింది. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం వల్లనే బరువు తగ్గిందన్నారు టీటీడీ అధికారులు. కొన్ని వందల సంవత్సరాలుగా రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల‌్లో వస్తున్న అపోహలను భక్తులను నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు.
టీటీడీపై అసత్య ప్రచారం చేస్తూ సునీల్ కుమార్ అనే వ్యక్తి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై పరుషమైన వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు ఉంటాయా లేదా అనేది టీటీడీ అధికారుల నిర్ణయం మేరకు ఉంటుంది.