కోట్లాది మంది ఆరాధ్య దైవం కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి భక్తుల కోసం నేటి నుంచి టీటీడీ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్య భక్తులకు సులభతరంగా సేవలందించడంతో పాటుగా దళారులను నిర్మూలనకు చెక్ పెట్టే విధంగా తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ నేటి‌ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నూతన విధానంను టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీసు విభాగానికి అనుసంధానం చేయడం ద్వారా దళారుల అక్రమాలను అత్యంత సులభంగా గుర్తించే వెసులుబాటు ఉంటుందని టీటీడీ భావించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా శ్రీవారి భక్తులకు సులభతరంగా ఈ విధానంను పూర్తి స్ధాయిలో అందించేందుకు టీటీడీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తొంది.


ప్రస్తుతం స్వామి వారి దర్శన టిక్కెట్ లకు సంబందించి ఆన్లైన్ విధానంలో కేటాయిస్తుండగా, శ్రీవారి మహాప్రసాదంను తయారీ చేసేందుకు నూతన యంత్రాలను లడ్డూ పోటులో వినియోగించి తక్కువ సమయంలో అధిక లడ్డూలను తయారు చేసి భక్తులకు కావాల్సిన లడ్డూలను అందించేందుకు టీటీడీ సిద్ధం అవుతుంది. అంతే కాకుండా శ్రీనివాసుడిపై ఎంతో‌ భక్తిభావంతో భక్తులు సమర్పించే నాణేలను లెక్కించేందుకు అధునాతనమైన యంత్రాలతో సులభతరంగా ఇక స్వామి వారికి భక్తులు సమర్పించే లెక్కింపు జరిగేందుకు ప్రణాళికలు చేస్తుంది.


ఫేస్ రికగ్నిషన్ విధానం
భక్తులు శ్రీవారిని సమర్పించిన కానుకల లెక్కింపును శ్రీవారి ఆలయంను నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులంతా కానుకల లెక్కింపు వీక్షించే విధంగా నూతన పరకామణిని నిర్మించి అధునాతనమైన సౌకర్యాలతో పరకామణి సిబ్బందికి అన్ని సౌఖర్యాలు ఉండే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఏడుకొండలపై భక్తులను నిలువు దోపిడి చేసే దళారులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అయితే మార్చి 1వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు, లడ్డు కౌంటర్లు, గదులు కేటాయింపు, రిఫండ్ కౌంటర్ల వద్ద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది టీటీడీ. ఇప్పటి వరకు సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేసే సమయంలో వారి ఆధార్ కార్డు నెంబర్ ను అనుసంధానం చేసి భక్తుల ఫోటో తీసుకుని టోకెన్లలను భక్తులకు జారీ చేస్తూ వస్తున్నారు. 


ఫోటో రికగ్నిషన్ విధానంతో భక్తులకు టోకెన్లు జారీ చేసే సమయంలోనే ఫోటో తీసుకుంటారు. తిరిగి వారు దర్శనానికి వెళ్ళే సమయంలో ఫోటో రికగ్నిషన్ అయిన వెంటనే దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఒక్కరి టోకెన్ పై మరొకరు దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుదరదు. అలా అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తొంది. ఇక లడ్డు టోకెన్లకు సంబందించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే సమయంలో ఫోటో రికగ్నిషన్ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు టీటీడీ సిబ్బంది. అదే పద్దతిలో దర్శనం అనంతరం లడ్డు కౌంటర్ వద్ద లడ్డూలను అందజేస్తారు. ఈ విధానం ద్వారా అక్రమ పద్ధతిలో లడ్డూలు పోందే దళారీలను పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చునని టీటీడీ భావిస్తుంది.  


గదుల కేటాయింపులో కూడా ఫేస్ రికగ్నిషన్
సామాన్య భక్తులకు గదులు కేటాయింపు సమయంలోను ఫేస్ రికగ్నిషన్ విధానాని అమలు చేయనుంది టీటీడీ. ఇదే విధానాన్ని గదులు ఖాళి చేసిన సమయంలో డిపాజిట్ల చెల్లింపునకు వినియోగించనున్నారు. దీంతో గదుల ఖాళీలు వేగవంతంగా జరుగుతాయని, గదులను దళారులు రోటేషన్ చేసే పద్దతికి అడ్డుకట్ట వేయవచ్చునని, మరోవైపు గదులు ఖాళీ చేసిన 48 గంటల సమయంలోనే భక్తుల డిపాజిట్లు వారి ఖాతాలో జమ అవుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.


ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా భక్తులకు సులుభతరంగా సేవలందించడంతో పాటు అక్రమాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చునని టీటీడీ‌ నమ్ముతుంది. ఫేస్ రికగ్నిషన్ విధానాని విజిలెన్స్ విభాగానికి, పోలీసు విభాగానికి అనుసంధానం చేయడం ద్వారా నేర చరిత్ర కలిగిన, దళారులుగా పలుమార్లు పోలీసులకు పట్టుబడిన వారిని సులభతరంగా గుర్తించవచ్చునని భావిస్తున్నారు.