AP Earthquake News: ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా వెల్లడించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.9 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ ద్వారా ఓ పోస్టులో తెలిపింది. సెంటర్ ఫర్ సిస్మోలజీ వెబ్ సైట్ లో కూడా భూకంప కేంద్రానికి సంబంధించిన ఊహాచిత్రాన్ని ఉంచారు. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో ఉందని అంచనా వేశారు.






తిరుపతి జిల్లా నాయుడు పేటలోని పిచ్చిరెడ్డి తోపు, మంగపతినగర్ ప్రాంతాల్లో గురువారం (మార్చి 14) రాత్రి 8.43 గంటల ప్రాంతంలో 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అయితే, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని.. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే 08772236007 నంబర్ కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీ కళ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో స్వల్పంగా కనిపించిన భూమి కంపించినట్లుగా తెలిసింది.