అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇంకా కలకలం రేపుతోంది. దీనిపై అటు అధికార, ఇటు విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఏపీ రాజకీయాల్ని వేడెక్కించారు. పోలీస్ గా ఉన్న సమయంలోనూ ఆయన వివాదాస్పదుడని, ఇప్పుడు ఎంపీ అయ్యాననే అధికారంతో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఓ మహిళ ఆరోపణలు చేశారు.  మహిళల్ని ఇలా వేధిస్తున్న గోరంట్ల మాధవ్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని, అలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించాలని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ వీడియోపై నిజానిజాలు తేలిన తరువాత పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇదివరకే చెప్పారు. అయినా ఈ వీడియోపై టీడీపీ నేతలు తగ్గడం లేదు.  


సీఐ వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికి..
నిరసనల్లో భాగంగా ఎంపీ గోరంట్ల దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు తెలుగు యువత ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు వీల్లేదని.. ఆయన బాధ్యత గల ఎంపీ అని అలాంటి నేత ఇలా వ్యవహరిస్తారా అని టీడీపీ శ్రేణులు పోలీసుల్ని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచేశాయి. ఇలాంటి వాళ్లు దండిగా ఉంటారని గోరంట్లకు మద్దతుగా మాట్లాడారు. మీవాళ్లు (టీడీపీ నేతలు) ఇలా చెయ్యలేదా అంటూ అడ్డంగా వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న సీఐ.. దేశాన్ని కాల్చండి అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై స్పందించారు.


పోలీసుల తీరు దారుణం.. చంద్రబాబు ఫైర్
ఒకప్పుడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారుతున్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు పోలీసుల తీరు శాఖకే తలవంపులు తెచ్చిపెడుతోందన్నారు. తప్పు చేసిన పార్లమెంట్ సభ్యులను సమర్థించే నీచ స్థాయికి కొందరు పోలీసులు వెళ్లడం దారుణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పోలీసులను కాస్త అదుపులో పెట్టాలి !
వైసీపీ ఎంపీపై చర్యలు కోరుతూ కుప్పంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు నిరసనకు దిగి ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నం చేయగా.. నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దేశాన్ని కాల్చండి అంటూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యాఖ్యలు చెయ్యడాన్ని ఏపీ డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరని చంద్రబాబు అన్నారు. నిందితులకు బహిరంగంగా పోలీసులు మద్దతు పలకడమే కాకుండా.. నిరసనలు చేపట్టిన టీడీపీ కుప్పం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడం మాని... బరి తెగించిన అధికారులను అదుపులో పెట్టి పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ డీజీపీ పై ఉందని ట్వీట్ చేశారు. 


Also Read: RK Roja: ఎంపీ న్యూడ్ వీడియోపై మంత్రి రోజా స్పందన, వాళ్లిద్దర్నీ అంత మాట అనేశారే!