షోలాపూర్-చెన్నై ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కడప-రేణిగుంట మధ్య ఉన్న ఎన్‌హెచ్ 716ను నాలుగు లేన్ల జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రహదారి విస్తరణపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ ట్వీట్ చేశారు. పశ్చిమ–తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ షోలాపూర్–చెన్నై ఎకనామిక్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి రవాణా సౌకర్యం మరింత సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ 716ను విస్తరించనున్నారు.
ఎన్‌హెచ్ 716 పూర్తైతే కడప, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట ఎయిర్‌పోర్టుతో కనెక్టవిటీ ఏర్పడుతుంది. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు షోలాపూర్‌కి కూడా కనెక్టివిటీ ఉంటుంది. దీని ఫలితంగా షోలాపూర్ తయారైన వస్తువులు సులువుగా రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఈ రోడ్డు విస్తరించిన ఉన్న ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.
గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా ఎన్‌హెచ్ 716ను డెవలప్ చేయనున్నారు. 120 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ. 1,500.11 కోట్లతో పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రోడ్ విస్తరణకు 1,066 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించింది కేంద్రం. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్‌గా పని చేస్తోంది.
రెండు ప్యాకేజీలుగా దీన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్యాకేజీ1 కింద వచ్చే ప్రాంతాలుః- కడప నుంచి ప్రారంభమై... బకర్‌పేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూర్, రాజంపేట, ఓరంపాడు వరకు. ప్యాకేజీ2 కింద వచ్చే ప్రాంతాలుః- పుల్లంపేట, ఒవ్వురపల్లి, అయ్యపురెడ్డి పల్లి, కోడూరు, శెట్టిగుంట, బల్లుపల్లె, మమండూరు రేణిగుంట వరకు రెండో ప్యాకేజీ కింద డెవలప్ చేస్తారు.