Ayodhya Ram temple Main Priest React On Tirumala Laddu Controversy: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదం తయారీపై చర్చకు దారి తీసింది. గుడుల్లో ఇచ్చే ప్రసాదాన్ని పూర్తిగా ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే తయారు చేయాలని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
భారత్‌లోని ఆలయాలపై విదేశీ శక్తుల కుట్ర:
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల తయారీపై నిఘా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రసాదం తయారీ పంపిణీ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరాన్ని పూజారులు గుర్తు చేస్తున్నారు. బయటి వ్యక్తులు లేదా ఏజెన్సీలు ఆలయాల్లో ప్రసాదం తయారు చేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ఆలయాల్లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదం రెడీ కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అమ్ముతున్న ఆయిల్, నెయ్యిపై కూడా తనిఖీలు జరగాలన్నారు. దేవేరులకు ఇచ్చే ప్రసాదాల్లో అన్య పదార్థాలు కలపడం ద్వారా గుడుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతున్నట్లు సత్యేంద్ర దాస్ అనుమానం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో బయట తయారయ్యే ప్రసాదాలపై ఆంక్షలు:
తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిన తరుణంలో మధుర ధర్మ రక్ష సంఘ్ కీలక నిర్ణయం తీసుకుంది. బయట తయారయ్యే స్వీట్లు లేదా ఇతర వంటకాలు ఏవీ దేవుడు దగ్గర ప్రసాదం ఇవ్వడానికి లేదని నిర్ణయించింది. సనాతన కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని తిరిగి పురుద్ధరిస్తున్నట్లు తెలిపింది. దేవేరులకు ఆలయంలో తయారైన ప్రసాదం మాత్రమే ఇవ్వాలని తీర్మానించింది. పూలు, పళ్లు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో సేకరించాలని మాల్స్ లేదా షాపుల్లో కొన్నవి వాడడానికి లేకుండా నిషేధం విధిస్తున్నట్లు సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ సౌరభ్ గౌర్ తెలిపారు. ప్రసాదం తయారీలో ఈ విధమైన సంస్కరణలు తప్పవని అన్నారు. మత పెద్దల దగ్గర ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. ఇకపై మథుర ఆలయంలో సాత్విక ప్రసాదాలే అందిస్తారని ఆయన చెప్పారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఆలయాల్లోకి భక్తులు బయట నుంచి స్వీట్లు తేవడంపై నిషేధం:
ప్రయాగ్‌రాజ్ సంగమ్ సిటీలోని అలోప్ శక్తి దేవి, బడే హనుమాన్, మన్‌కామేశ్వర్ సహా అనేక ఆలయాల్లో భక్తులు బయట కొన్న స్వీట్లను ఆలయంలోకి తేవడంపై నిషేధం విధించారు. భక్తులు కేవలం టెంకాయలు, పూలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మాత్రమే తేవాలని ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకున్నట్లు లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివ్ మూరత్ మిశ్ర వివరించారు. సంగమ్ సిటీలోని టెంపుల్ కారిడార్ పూర్తైన తర్వాత ఆలయ ట్రస్టులే ప్రసాదంగా లడ్డూ-పెడా తయారు చేసేలా నిర్ణయం జరిగినట్లు బడే హనుమాన్ ఆలయ పూజారి తెలిపారు. లక్నో లోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికే బయటన కొన్న ప్రసాదాలపై నిషేధం విధించారు. భక్తులు ఇళ్లల్లో తయారు చేసిన ప్రసాదాలనే ఆలయానికి తీసుకు రావాలని నిబంధన పెట్టారు.
తిరుమల లడ్డు కల్తీ అంశం బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఆలయాల్లో దేవుడుకి ఇస్తున్న ప్రసాదాలపై నిఘా పెరిగింది. బయట నుంచి తెస్తున్న ప్రసాదాల్లో వాడిన నెయ్యి నూనె తయారీపై ఆందోళన ఉండగా భక్తులు కూడా ఇళ్లలోనే ప్రసాదం తయారు చేసుకొని ఆలయానికి రావడానికి అలవాటు పడుతున్నారు.
Also Read: తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం? జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?