Tomato Price: టమోటా ధరలకు మళ్లీ రెక్కలు, సెంచరీ వైపు దూసుకెళ్లడంతో సామాన్యులు బెంబేలు
Tomato Price In AP: ఏపీలో కూరగాయల మార్కెట్లలో టమోటా ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలోనూ అధిక ధరలకు టమోటా విక్రయాలు జరుగుతున్నాయి.
Tomato Price In AP Raitu Bazars: రెండు నెలల కిందటి వరకు ఒక కిలో రూ.12 నుండి 15 రూపాయలు మాత్రమే పలికిన టమాటా ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో 70 నుండి 80 రూపాయలకు చేరింది. రానున్న రోజుల్లో100కు చేరుకుంటుదేమో అని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతు బజార్లలో సైతం 54 రూపాయలకు విక్రయిస్తున్నట్లు బోర్డులు పెట్టినా స్టాకు అందుబాటులో ఉంచకుండా బయటి మార్కెట్లకు తరలిస్తున్నారు.
కొన్ని స్టాళ్లల్లో ఉన్నప్పటికీ నాసిరకం సరుకు ఉండడంతో కొనుగోలు దార్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. బోర్డులో ఉన్న ధరల కంటే అధికంగా టమాటా ధరలు పెంచి వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే స్టాకు లేదని బుకాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వినియోగదారులు. టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లెలో టమాటా పంట చేతికి రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరానికి బెంగుళూరు, హైదరాబాద్ నిజామాబాద్ నుండి టమాటాలు దిగుమతి అవుతున్న దృష్ట్యా ఏపీలోని రైతు బజార్లలో ధరలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. మరికొన్ని రోజుల్లో టమాటా ధరలు దిగివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
టమోటా ధరలను కంట్రోల్ చేస్తున్నాం... ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు. బహిరంగ మార్కెట్ లోని ధరల కంటే రైతు బజార్లలో విక్రయించిన టమాటాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని, కేజీ పై సుమారు 15రూపాయలు వరకూ తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు. రైతుబజార్లలో నిర్వహించిన టమాటా విక్రయాలు కొన్ని గంటల్లోనే పూర్తి అయిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి ప్రకటనకు ఆచరణకు పరిస్దితులు భిన్నంగా ఉన్నాయి. రైతు బజార్లలోనే నాసిరకం టమోటాలు అందుబాటులో ఉండటం పై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల, జులై, ఆగస్టు కోటా రిలీజ్