టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో రౌడీయిజం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో పాటుగా పోలీసులను దూషిచడం సరైన విధానం కాదని, ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని ఏపీ అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమలలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా చూస్తూనే ఉన్నారని, మొదట కందుకూరులో చంద్రబాబు సభలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి గాయాలపాలు అయ్యారని, అయితే ఇరుకైన రోడ్లు సమావేశాలు పెట్టడం, స్టాంప్ పైడ్స్ పెట్టడం కారణంగానే ఎనిమిది మంది మృతి చెందాలని చెప్పారు.
గుంటూరులో నిర్వహించిన చంద్రబాబు సభలో ముగ్గురు మృతి చెందారని, చంద్రన్న కానుకలు ఇస్తామనడంతో ప్రజల ఆశతో వెళ్లి ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం తరఫు నుంచి మృతి చెందిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం చెల్లించామన్నారు. అనుమతులు లేకుండా సభలో నిర్వహించడం కారణంగా ప్రమాదాలు జరుగుతుందని భావించిన ప్రభుత్వం జీవో నెంబర్ 1ని విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ జీవోలో ఎలాంటి ఆంక్షలు లేవని, ఇరుకైనా రోడ్లలో గానీ, రోడ్లలో గానీ సభలో జరుపుకూడదని మాత్రమే జీవోలో పొందుపరిచామని వివరించారు. సభ నిర్వహించాలంటే ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని, పోలీసుల నిబంధనలను పాటించాలన్నారు. ఇవేవీ లెక్క చేయకుండా చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీసును తీసుకోకుండా పోలీసులను నోటికి వచ్చినట్లు దూషించడం సమంజసం కాదన్నారు.
పోలీసులను కొట్టే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు !
కుప్పంలో బుధవారం జరిగిన పరిస్థితులు చూస్తుంటే టిడిపి కార్యకర్తలు పోలీసుల పట్ల దారుణంగా వ్యవహరించాలని, టిడిపి కార్యకర్తలు పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. కుప్పంలో పోలీసులను కొట్టే విధంగా చంద్రబాబు తమ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, తమపై తిరగబడిన టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని, అయితే ఎంతసేపటికి టిడిపి కార్యకర్తలు పోలీసులపైకి తిరగబడుతుండడంతో లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం తలెత్తిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ముఖ్యమంత్రి అయిన, అధికార పార్టీ నాయకులైన, ప్రతిపక్ష నాయకులైన ఖచ్చితంగా నిబంధనలను పాటించాలన్నారు. అదేవిధంగా పలమనేరు డివిజన్లో 30 ఆక్ట్ అమలులో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సభలు నిర్వహించడం సరైన విధానం కాదన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో కాకుండా ఒక రౌడీలా వ్యవహరించి నేను కూడా కుప్పంలో ఒక నాయకుడే అని చెప్పుకునే పరిస్థితి ఆయనకి ఏర్పడిందన్నారు.
పరాభవం నుంచి పరపతి సంపాదించాలని చంద్రబాబు కుట్రలు
గతంలో ఎన్నో పర్యాయాలు శాసనసభ్యులుగా, సీఎంగా ఉన్న చంద్రబాబు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు, జడ్పిటిసి, మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందారని, తిరిగి తన పరపతిని సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై నిజమైన నమ్మకం ఉంటే వరుసగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు ఓడిపోతారు అని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు పోలీసులపై వ్యవహరించిన తీరు ఖండిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కుప్పంలో జరిగిన ఘటనపై చంద్రబాబు కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ కుప్పం జగన్ రెడ్డి జాగీరా అంటూ ట్విట్ చేశారని, అయితే తాము ఎప్పుడు కుప్పం జగన్ జాగీర్ అని చెప్పలేదని, లోకేష్ ఆలోచన లేకుండా ట్విట్ చేస్తున్నారంటూ తండ్రీకొడుకులపై మండిపడ్డారు.
నిబంధనలకు కట్టుబడి పోలీసుల అనుమతులతో సభలు, సమావేశాలు నిర్వహించాలే గానీ, రౌడీయిజం చేస్తే తనకు ప్రజల్లో పరపతి పెరుగుతుందని చంద్రబాబు ఇలా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు రాజకీయ విలువలను తుంగలో తొక్కే విధంగా ప్రవర్తించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు తన కార్యకర్తలను రెచ్చ గొడుతున్నారన్నారు. ఇటీవల నంజంపేటలో పెద్ద ఎత్తున కట్టెలు రాళ్లు హాకీ స్టిక్లు తీసుకుని వచ్చి శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీ నాయకులపై టిడిపి కార్యకర్తలు దాడి చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా చేస్తే ప్రజలు నమ్ముతారని కొట్రపూరితంగా చంద్రబాబు మమ్మల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. ఇకనైనా చంద్రబాబు తెలుసుకొని మసులుకోవాలని ఇంకా రౌడీయిజం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్రంలో అనేకచోట్ల ఎలాంటి ఘటనలే జరుగుతున్నాయన్నారు.
గతంలో సినిమా స్టైల్ లో గోదావరి పుష్కరాల్లో స్నానం చేయాలని వెళ్లిన చంద్రబాబు 28 మంది మరణంకి కారుకులయ్యారని,అయితే దానిని తేలికగా తీసిపడేసారన్నారు. కనీసం మనుషులు చనిపోయారని విచారించాల్సిన చంద్రబాబు మానవత్వం మరిచి ప్రవర్తించడంమే కాకుండా రాక్షసత్వానికి నిదర్శనంగా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.