Anantapuram News: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి విషయంలో రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఎందుకివ్వలేదని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వెంటనే రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే డిక్లరేషన్ ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి సిద్ధమయ్యారు. ఉదయం 8.30 గంటలకు డిక్లరేషన్ ఇస్తామని టీడీపీ నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 8.30కి కలెక్టరేట్ వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, డిక్లరేషన్ ఫారం ఇంకా ఇవ్వనందుకు జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు ఆయన శనివారం రోజు ధర్నాకు దిగారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, ప్రభాకర్ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు, శ్రీధర్ చౌదరి, ఆలం నరసానాయుడు, ఆదినారాయణ, నెట్టం వెంకటేష్ కూడా నిరసన తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి కి ఇంకా డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలో భాగంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాహనాలను నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకువెళ్లారు. జేఎన్టీయూ కాలేజ్ దగ్గర ఉద్రిక్తంగా మారడంతో ముందుగానే ప్రత్యేక భద్రతా బలగాలను కూడా రప్పించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భయానక వాతావరణం నెలకొంది.
రాంగోపాల్ రెడ్డి విజయం అనంతరం డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా కాలయాపన చేసి చివరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్ళిపోతుండడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. కలెక్టర్ గారి వాహనాన్ని అడ్డగించి నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా సరైన రీతిలో స్పందించని కలెక్టర్ కు నిరసన ద్వారా తమ బాధని వ్యక్తపరిచామని చెప్పారు. ఆయన తీరుపై నిరసన చేస్తే, అరెస్ట్ చేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్ నిర్బంధంలోకి తీసుకున్నారని వాపోయారు. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగడంతో.. రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.