Crime News: మద్యం జీవితాలను చిదిమేస్తుందని మరోసారి రుజువైంది. మద్యం మత్తులో తండ్రి కన్న కూతురుని అతి దారుణంగా హత్య చేసిన దుర్ఘటన చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం రొంపిచర్లలో జరిగింది. చిన్నతనంలో కన్నతల్లి మృతి చెందింది. తండ్రితోపాటు నాన్నమ్మ వద్ద పెరిగింది 13 సంవత్సరాల గౌతమి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఇటీవల  నాన్నమ్మ కూడా మరణించింది. తండ్రి, కుమార్తె మాత్రమే ఉన్నారు. 


ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి వచ్చి గౌతమి ఇంట్లో ఉంది. తండ్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో పని ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. తాగి వచ్చావా అని కుమార్తె నిలదీసింది. అంతే కోపానికి గురై తండ్రి పక్కనే సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్‌తో గౌతమి గొంతు బిగించి చంపేసాడు. 


రాత్రి అంతా మద్యం మత్తులో ఉండిపోయాడు. ఉదయం లేచి తన కుమార్తె మంచంపై నుంచి లేవలేదని పక్కన వారిని పిలిచి చెప్పడంతో మృతి చెందినట్లు గుర్తించారు. దహన సంస్కారాలకు సిద్దం చేసే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తండ్రే మద్యం మత్తులో పనులు చేయలేదని కూతురుని చంపినట్లు చెప్పడంతో పోలీసులు అవ్వాకయ్యారు. పాఠశాలలో మంచి మార్కులు సాధించే చిన్నారిని తండ్రే హత్య చేయడం సంచలనంగా మారింది.