Tension At RK Roja House : నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాల మేరకు తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో చీర, గాజులుతో రోజా ఇంటిలోని ముట్టడించేందుకు టీడీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న నగిరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్లకుండా భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెలుగు మహిళలు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే తెలుగు మహిళలను, టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పోలీస్ స్టేషన్ నిండిపోయింది. మంత్రి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు.
లోకేశ్ పై మంత్రి రోజా సీరియస్ కామెంట్స్
యువగళం పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చంద్రబాబు, లోకేశ్ సంపాదనపై, తన సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ఎదురు పడితే లోకేశ్ గుండె ఆగిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అంకుల్ ఒక ఐరెన్‌లెగ్ అని ఫైర్ అయ్యారు. లోకేశ్ ఎవరు అంటే చంద్రబాబు కుమారుడు.. బ్రాహ్మణి భర్త అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేశ్ ఇంకోసారి తన గురించి మాట్లాడితే అడవాళ్లతో కొట్టిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో నరకం చూపించినా ఎదుర్కొని నిలబడ్డానని, కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని రోజా ఆరోపించారు. మా నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు నిన్న లోకేశ్ ను కొట్టడానికి వచ్చారని రోజా తెలిపారు. లోకేశ్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పక్కన పెట్టాడని రోజా విమర్శించారు. జబర్దస్త్ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడితే పళ్లు రాలతాయని హెచ్చరించారు. దమ్ముంటే లోకేశ్ సంపాదన తన సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అని మంత్రి రోజా సవాల్ విసిరారు. తాను కష్టపడి షూటింగ్స్ చేసి ఇల్లు కట్టుకున్నానని, హెరిటేజ్ వెహికిల్ లో ఎర్ర చందనం తరలించింది ఎవరు అని రోజా ప్రశ్నించారు. జగన్ పులి అయితే.. లోకేష్ పులకేసి అని ఎద్దేవా చేశారు.
లోకేశ్ ఐరన్ లెగ్...
లోకేశ్ అంకుల్ ఒక ఐరన్ లెగ్ అని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఆయన చేస్తున్నది పాదయాత్ర కాదని.. "జోకేశ్" యాత్ర అని ఎద్దేవా చేశారు. లోకేశ్ రాజకీయ ఎంట్రీతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పతనం ఆరంభం అయ్యిందన్నారు. అవినీతికి కేరాఫ్ నారా కుటుంబం అని విమర్శించారు. రెండెకరాల చంద్రబాబు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు.