Jeevitha Rajasekhar : గరుడ వేగ ఆర్థిక లావాదేవీలపై నిర్మాత కోటేశ్వరరాజు మరోసారి స్పందించారు. జీవిత రాజశేఖర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గరుడవేగ సినిమా నిర్మాత, జోస్టర్ ఫిలిం గ్రూప్స్ ఫౌండర్ కోటేశ్వరరాజు అన్నారు. సోమవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవిత రాజశేఖర్ మా వద్ద సినిమాకు అప్పు తీసుకుని మాపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద కోట్ల రూపాయలు సీజ్ చేశారని, జీవిత రాజశేఖర్ సినిమా ప్రొడ్యూసర్లను ట్రాప్ చేస్తున్నారన్నారు. మేము కూడా జీవితా రాజశేఖర్ ట్రాప్ లో పడ్డామన్నారు.‌ తాము లండన్ నుంచి వచ్చామని, ఆవలిస్తే పేగులు లెక్కిస్తామన్నారు. జీవిత రాజశేఖర్ తన మామను తీసుకొచ్చి తన భార్య హేమ కాళ్లు పట్టుకుని కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని ఆరోపించారు. 


కోర్టు నోటీసులపై ఆధారాలున్నాయి 


రాజశేఖర్ కు డబ్బు అవసరం లేదని జీవితకు డబ్బు అవసరమని, జీవిత తన కూతుళ్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని నిర్మాత కోటేశ్వరరాజు ఆరోపించారు. జీవిత గతంలో చాలా సార్లు మోసం చేసిందని రాజశేఖర్ తండ్రి వరదరాజన్ తమ దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారని ఆయన తెలిపారు. జీవిత చిలక పలుకులు మీడియాతో కాదని, కోర్టులో చెప్పాలన్నారు. జీవిత, రాజశేఖర్ లకు తాము డబ్బు ఇచ్చిన రోజు దేవుళ్లుగా కనిపించామని, కానీ ఇప్పుడు తామేవరో తెలియనట్లు మాట్లాడుతున్నారన్నారు. జీవితకు కోర్టు నోటీసులు వెళ్లాయనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. 


డాక్యుమెంట్స్ పోయాయని అబద్ధాలు 


డాక్యుమెంట్స్ పోయాయని జీవిత అబద్ధాలు చెబుతున్నారని కోటేశ్వరరాజు అన్నారు. రాజశేఖర్ కోసం తన తమ్ముడితో జీవిత రాజశేఖర్ డ్రగ్స్ తెప్పించుకుందని, రాజశేఖర్ తో సినిమా తీసేవాళ్లు లేరు, సినిమా విడుదలైతే చూసేవాళ్లు కూడా ఎవరూ లేరన్నారు. అనంతరం జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హేమా మాట్లాడుతూ.. తమ మంచితనాన్ని జీవితా రాజశేఖర్ ఆసరాగా తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. పార్టీలకతీతంగా మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు సహాయం చేయాలన్నారు. ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్తామని, జీవితా రాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. జీవితా రాజశేఖర్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని గరుడవేగ సినీ నిర్మాత సతీమణి హేమా అన్నారు.


అసలేం జరిగిందంటే? 


సినీ నటులు జీవిత, రాజశేఖర్ పై గరుడ వేగ నిర్మాత, జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ హేమా, కంపెనీ ఫౌండర్ కోటేశ్వరరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హేమా మాట్లాడుతూ.. జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో చలామణి అవుతున్నారని, కానీ వారి వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని హేమా ఆరోపించారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల జీవిత, రాజశేఖర్ తో పరిచయం అయ్యామన్నారు. జోస్టర్ ఫిలిం గ్రూప్స్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమయంలో పీఎస్-4 గరుడ వేగ సినిమా తీసామని తెలిపారు. రాజశేఖర్ తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.26 కోట్లు అప్పు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. తమ వద్ద ప్రాపర్టీ పెట్టి మోసం చేశారని చెప్పారు. జీవిత, రాజశేఖర్ పై క్రిమినల్ కేసులు పెట్టామని, చెక్ బౌన్స్ కూడా ఉందని తెలిపారు. 


జీవిత స్పందన 


ఈ ఆరోపణలపై స్పందించిన జీవిత రాజశేఖర్.. చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిన మాట నిజమే కానీ ఎవరూ అరెస్టు కాలేదన్నారు. ఈ కేసులో నగరి కోర్టులో రెండు నెలల క్రితమే తీర్పు వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామన్నారు. తాము రూ.26 కోట్లు ఇవ్వాలని అన్నారని, అది నిరూపించాలని సవాల్ చేశారు. సుమారు రెండు నెలల నుంచి కేసు కోర్టులో ఉందని, కానీ ఇప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదన్నారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్‌ ఇష్యూ అయినా తమకెలాంటి నోటీసులు అందలేదన్నారు. తమ గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదన్నారు. తమ గురించి ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదని, వాళ్ల వల్ల తమ మేనేజర్‌, చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కేసు విషయంలో దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో కొంతమంది పెడుతున్న థంబ్ నెయిల్స్ చూస్తుంటే బాధగా అనిపిస్తోందన్నారు.