Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. తిరుపతి నగరంలోని మంగళం బి.టి.ఆర్ కాలనీకి చెందిన నలుగురు బాలురు  కనిపించకుండా పోయారు.  బుధవారం ఉదయం స్కూల్ కు  బయలుదేరిన విద్యార్థులు స్కూల్ కి వెళ్లలేదు. మంగళం జెడ్పీ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న నాని చరణ్, మోహిత్ లతో పాటు ఆరో తరగతి చదివే లోకేష్, ఎనిమిదో తరగతి చదువుతున్న వెంకటేష్ లు మిస్ అయ్యారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీలు పరిశీలించిన పోలీసులు మొదట విద్యార్థులు కపిల్ తీర్థం వెళ్లి అక్కడి నుంచి లీలా మహల్ సర్కిల్ కు చేరుకున్నట్లు గుర్తించారు. ఆ తరువాత విద్యార్థులు ఎటు వెళ్లారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 


రైల్వే స్టేషన్ కు వెళ్లిన విద్యార్థులు 


 మంగళం బీటీఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యా్ర్థులు మిస్సింగ్ అయ్యారు. బుధవారం స్కూల్ కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికంగా గాలించారు. విద్యార్థుల ఆచూకీ దొరక్కపోవడంతో గురువారం ఉదయం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం కపిల్ తీర్థం వెళ్లి స్నానం చేశారు. అక్కడి నుంచి లీల మహల్ సర్కిల్‌కు తిరిగి వచ్చి, అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లాలనేది వాళ్ల ఆలోచనగా తెలుస్తుంది. అయితే విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో ఇంకా తెలియరాలేదు. విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు


ఇటీవల ఇలాంటి ఘటనే! 


తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలో చదువుకున్న ఐదు మంది విద్యార్థులు ఇటీవల అదృశ్యం అయిన ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అదృశ్యమైన ఐదుగురు విద్యార్థులు దాదాపు ఐదు రోజుల తరువాత ఆచూకీ లభ్యమైంది.  ఆగ్రాలో ఉన్నట్టు తిరుపతి వెస్ట్ పోలీసులు గుర్తించారు. నవంబర్ 9వ తేదీన నెహ్రూ నగర్‌లోని అన్నమయ్య ప్రైవేటు పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు స్కూల్‌లో పరీక్ష రాసిన తర్వాత  టిఫిన్ చేసేందుకు ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి ఎటో వెళ్లిపోయారు. ఇంటికి పిల్లలు రాలేదని తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీస్తే అక్కడ కూడా లేరు. ఇందులో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. విద్యార్థుల అదృశ్యం పై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం ఐదు ప్రత్యేక బృందలు ఏర్పాటు చేసి గాలించారు. 


ఆగ్రాలో విద్యార్థులు 


విద్యార్థులు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్నట్టు తిరుపతి వెస్ట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. వారు ఆగ్రాలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆగ్రా వెళ్లి వారిని తిరుపతికి తీసుకొచ్చారు.  తిరుపతిలో ఇటీవల అదృశ్యమైన ఐదుగురు విద్యార్థులను పోలీసులు వెతికిపట్టుకున్నారు. విద్యార్థులు ఆగ్రాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో ఆగ్రా పోలీసులు విద్యార్థులను సంరక్షణలోకి తీసుకున్నారు. విమానంలో ఆగ్రాకు బయలుదేరివెళ్లిన తిరుపతి పోలీసులు ఆగ్రాకు చేరుకుని విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. విద్యార్థులను విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి తీసుకువచ్చారు.