Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. వేసవి రద్దీ దృష్ట్యా ఆలయంలో నిజపాద దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 71,119 మంది దర్శించుకున్నారు. 37,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.91 కోట్లగా నమోదైనట్లు టీటీడీ ప్రకటించింది. శనివారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జులై, ఆగస్టు నెలల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. రోజుకు 25 వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచనుంది. మొత్తం 13.35 లక్షల టికెట్లకు గానూ ఉదయం 11 గంటలకు 3.50 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని టీటీడీ తెలిపింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేసినట్టు పేర్కొంది. జులై, ఆగస్టు నెలల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం అందుబాటులోకి ఉంచింది టీటీడీ. జున్ నెలకు సంబంధించిన టిక్కెట్లకు ఇంతకు ముందే జారీ చేశారు. ఈ కారణంగా జులై, ఆగస్టు టిక్కెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్ ధర రూ. మూడు వందలు. రెండు నెలలకు మొత్తం 13.35 లక్షల టిక్కెట్ల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
సర్వదర్శనం టికెట్లు అందుబాటులో
సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో, తిరుమలలోని భూదేవి కంప్లెక్స్, శ్రీనివాస కంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఇప్పటికే భక్తులకు అందించనుంది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా కంపార్ట్ మెంట్లలో వేచియుండే పనిలేకుండా సర్వదర్శనం టిక్కెట్లు పొంది వచ్చిన టైం ప్రకారం క్యూలైన్ లోకి వెళితే గంట నుంచి ఒకటిన్నర్ర గంటలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.