Tiruamala News : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు(Ghat Road)లో ఏనుగులు(Elephants) హల్ చల్ చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపైకి వచ్చాయి. ఏనుగుల ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఏడో మైలు వద్ద మూడు పెద్ద ఏనుగులు, ఓ చిన్న పిల్ల ఏనుగును ప్రయాణికులు గుర్తించి విజిలెన్స్, అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ(TTD Forest Officers) అధికారులు ఘటన స్ధలానికి చేరుకుని భారీగా సైరన్ మోగించారు. దీంతో ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో పంపే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు సంచరించిన విషయం తెలిసిందే. 


ఏనుగుల సంచారంపై మానిటరింగ్


టీటీడీ ఫారెస్టు డీసీఏఫ్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఏనుగులను అటవీ ప్రాంతంలో పంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఏనుగుల గుంపులో మూడు పెద్ద ఏనుగులు, ఒక చిన్న ఏనుగు పిల్ల ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏనుగుల సంచారంపై మానిటరింగ్ చేస్తున్నామని, నెల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని, వీటి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, భక్తులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు. 


భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు 


"మూడు ఏనుగులు, ఒక పిల్ల  ఏనుగు డౌన్ ఘాట్ రోడ్లులో కనిపించాయని ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందింది. ఏనుగులు ప్రస్తుతం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. వాటి వల్ల ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదంలేదు. ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది కలిసి ఏనుగులను ఘాట్ రోడ్డులోకి రాకుండా చర్యలు చేపడుతున్నాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని టీటీడీ(TTD) ఫారెస్ట్ డీసీఎఫ్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు.  


ఘాట్ రోడ్డులో వన్యప్రాణులు 


తిరుమలలో ఘాట్ రోడ్డుపైకి తరచూ వన్యప్రాణులు వస్తుంటాయి. చిరుతలు, ఏనుగులు, జింకల ఇతర జంతువులు భక్తులకు తరచూ కనిపిస్తుంటాయి. గత నెలలోనూ 5 ఏనుగుల గుంపు తిరుమల మొదటి ఘాట్ లో కనిపించాయి. ఏపీలో చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల సంచారం కనిపిస్తుంటుంది. పంట పొలాల్లోకి వచ్చి ఏనుగులు పంటలు నాశనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏనుగుల గుంపుల నుంచి తమను కాపాడాలని రైతులు, స్థానికులు అధికారులకు మొర పెట్టుకొన్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారంతో  టీటీడీ అప్రమత్తమైంది.