Tirumala Arjita Seva Tickets Released: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను (Arjitaseva Tickets) గురువారం అధికారులు విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచారు. అలాగే, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఫిబ్రవరి కోటాను సైతం విడుదల చేశారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి గగన మార్గంలో వచ్చే భక్తులకు జారీ చేసే శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రెట్టింపు చేశారు. ఎయిర్‌పోర్టులో దర్శన టికెట్ల సంఖ్యను 100 నుంచి 200 కు పెంచారు. విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్ పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తారు.


తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్‌లో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తోన్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. ఈ నెల 22 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. కాగా, ఇటీవలే శ్రీవాణి ట్రస్టును పాలకమండలి రద్దు చేసింది. ఈ ట్రస్టు ద్వారా విక్రయించే టికెట్ల సొమ్మును శ్రీవారి ఖజానాకు జమ చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది.


ముఖ్యమైన తేదీలివే



  • శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.

  • ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, తిరుమల, తిరుపతి ఫిబ్రవరి నెల గదుల కోటాను ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


వృద్ధులకు ఉచితంగా..


మరోవైపు, సీనియర్ సిటిజన్లకు స్వామి వారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు. వీరు ఫోటో ఐడీతో పాటు వయస్సును నిర్ధారించే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని S1 కౌంటర్‌కు నివేదించాల్సి ఉంటుంది. వీరు వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారిని దాటాలి. ఏ మెట్లు సైతం ఎక్కాల్సిన పని లేదు. అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు. వీరి సీట్ల దగ్గరికే తెచ్చి అల్పాహారం, భోజనం అందిస్తారు. పూర్తి వివరాలకు హెల్ప్ లైన్ నెం. 08772277777ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


Also Read: PPP Model Chandrababu: ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?