Prithviraj Joins Janasena : తెలుగు సంవత్సరాది ఉగాది నాడు జనసేన పార్టీలో చేరనున్నట్లు సినీ నటుడు పృథ్వీ రాజ్ తెలియజేశారు. మంగళవారం కొత్త రంగుల ప్రపంచం చిత్రం సినిమా హీరో, హీరోయిన్ లతో కలిసి పృథ్వీరాజ్ తిరుమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన పృథ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్ళు హాస్యనటుడుగా ఉన్న తాను కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రానికి డైరెక్టర్ గా సినిమాను తీశానని చెప్పారు. మార్చిలో‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు. అదే విధంగా కొత్త సంవత్సరం ఉగాది నుంచి జనసేన పార్టీలో చేరి కార్యకర్తగా పని చేస్తానని, పవన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సినీనటుడు పృథ్వీ రాజ్ ప్రకటించారు. 


"కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా దర్శకత్వం చేశాను. ఆ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా విజయవంతం కావాలని తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం ఇక్కడి వచ్చాను. ఈ ఉగాదికి జనసేనలో చేరబోతున్నాను. పవన్ కల్యాణ్ నిర్ణయిస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తాం." - పృథ్వీరాజ్ 


బీఆర్ఎస్-జనసేన పొత్తుపై


తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆఫర్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై  జనసేన మద్దతుదారు పృథ్వీ రాజ్ సోమవారం స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి వార్తలు వేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో తనకు రూ. 200 కోట్లు ఇచ్చారని వార్తలు వేశారన్నారు. ఆ రూ.200 కోట్లు లెక్క పెట్టి రావడానికి ఇన్ని రోజులు పట్టిందని వ్యంగ్యంగా అన్నారు. జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఎవరి ఆఫర్ల కోసం ఆశపడే వ్యక్తి కాదన్నారు. ట్యాక్స్ కట్టడానికే రూ.9 కోట్ల అప్పు చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుర్తుచేశారు. అలాంటి వార్తలు వేస్తే సర్క్యూలేషన్ వస్తాయని కొందరు ఇలా చేశారన్నారు.  తారకరత్న మరణంపై లక్ష్మీ పార్వతి మాటలు బాధాకరమన్నారు. ఆమె అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదన్నారు. లోకేశ్ ఐరన్ లెంగ్ అంటూ ఆయన పాదయాత్ర వల్లే తారకరత్న చనిపోయారని లింక్ చేస్తూ చెప్పడం దారుణం అన్నారు.  


"ఇదంతా పబ్లిసిటీ స్టంట్. అలాంటిది ఏమైనా ఉంటే నాదెండ్ల మనోహర్, నాగబాబు ఖండిస్తారు. జనానికి ఏమైనా చేయడానికి వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. పేపర్ల సర్క్యూలేషన్ కోసం ఇలాంటి వార్తలు రాస్తుంటారు.  ఓ సినిమా తీశాను. అది హిట్ అవ్వాలని తిరుమల వచ్చాను. నా అసలు మొక్కు 2024 మీకు తెలియజేస్తాను. కన్నా లక్ష్మీనారాయణ నాకు గురువు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అక్కడ ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చారు. తారకరత్న సడెన్ గా వెళ్లిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రతీది లింక్ పెట్టి మాట్లాడకూడదు. లక్ష్మీ పార్వతి తారకరత్న మరణంపై చేసిన తప్పు" - పృథ్వీ రాజ్, సినీ నటుడు, జనసేన నేత