అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అల్తాఫ్(19) అనే యువకుడిపై ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సోమవారం అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు అతన్ని అడ్డుకున్నారు. బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పట్టణ సమీపంలోని నవోదయ పాఠశాల సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. 


స్థానికులు వారిని పట్టుకోవడానికి యత్నించగా పారిపోయారు. మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.