Three IPS officers conspired with Kukkala Vidyasagar AP Police In Remand Report : హీరోయిన్ జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పరారీలో ఉన్న ఏ వన్ కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్‌లో పట్టుకుని విజయవాడకు తీసుకు వచ్చి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్ తో కలిసి ఐపీఎస్‌లు కుట్ర పన్ని జెత్వానీపై తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ కేసులో ఏ1 విద్యాసాగర్ , ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా ఏ4గా వెస్ట్ జోజ్ పూర్వ ఏసీపీ హనుమంతురావు , ఏ5గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ , ఏ6గా ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని చేర్చారు.
అయితే ఎఫ్ఐఆర్‌లో ఇంకా ముగ్గురి పేర్లు చేర్చలేదు. నేడో, రేపో ఆ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చి అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అరెస్టు ముప్పు ఉందని తెలియడంతో ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. తనపై తప్పుడు కేసు పెట్టారని.. తాను జెత్వానీ విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని కాంతి రాణా టాటా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసకోలేదు.
జెత్వానీపై కేసు నమోదు చేయడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అసలు జెత్వానీ ఎవరికీ భూమి అమ్మకానికి పెట్టలేదని.. ఎవరికీ ఆమె డబ్బులివ్వలేదని తేలింది. ఆమెపై ఫిర్యాదులో కుక్కల విద్యాసాగర్ పేర్కొన్న వ్యక్తులే ఈ విషయాన్ని విచారణాధికారులకు చెప్పారు. తమకు జెత్వానీతో ఎలాంటి పరిచయం లేదని ఆమె .. స్థలం అమ్మజూపలేదని స్పష్టం చేశారు. ఇలా జెత్వానీపై తప్పుడు కేసు పెట్టడం కోసమే అన్నీ ఓ ముఠాగా ఏర్పడి రెడీ చేసి వేధించారని తేలడంతో.. కేసులు పెట్టారు. ముగ్గురు ఐపీఎస్‌లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.