Pingali Venkayya : మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గురించి ఇప్పటి తరానికి అంతగా తెలియదు. జాతీయ ఉద్యమానికి ఊతమిస్తూ మన దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే మువ్వన్నెల పతాకం గగనంలో ఎగురుతున్న దృశ్యాన్ని చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందుకే జాతీయ పతాక ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు, విశిష్టతను గుర్తించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి 15 వరకు దేశంలోని అన్ని ఇళ్లపై " హర్ గర్ తిరంగా" పేరుతో జాతీయ పతాకాలను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా పతాకం కావాలనుకున్న మహాత్మాగాంధీ - సిద్ధం చేసిన పింగళి
హర్ ఘర్ తిరంగా కోసం కోట్లాది జాతీయ జెండాలను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం తల మనకలై ఉంది. ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు పొందిన మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు మహనీయుడేనన్న విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అన్న ప్రశ్న వేస్తే, దానికి సమాధానం ఇప్పటికీ కొంత మంది మాత్రమే చెప్పలేరు. జాతీయ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ ఉద్యమానికి ఊతంగా నిలిచేందుకు ఒక పతాకం కావాలన్నా మహాత్మా గాంధీ ఆశయాలకు పింగళి వెంకయ్య రూపమిచ్చారు. పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జాతీయ పతాకానికి మహాత్మా గాంధీ కొన్ని చిన్నపాటి మార్పులతో ఆమోదం తెలపడం తో తొలిసారిగా మన దేశానికి ఒక జాతీయ పతాకం ఏర్పడింది.
ఇప్పటి బాపు మ్యూజియంలో ఆవిష్కరించిన కొండా వెంకటప్పయ్య పంతులు
పింగళి వెంకయ్య కృష్ణ జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య పూర్తిచేసుకుని. ఉన్నత విద్య బందరు లో అభ్యసించారు. చిన్ననాటి నుండే దేశభక్తి గల వెంకయ్య 19 వ ఏట సైన్యం లో కొంతకాలం పని చేశారు. అనంతరం రైల్వే గార్డ్ గా కూడా సేవలందించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, జపాన్ భాషలలో పింగళి వెంకయ్య పండితులు. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ఆమోదం పొందాక అప్పటి విక్టోరియా, ప్రస్తుతం బాపు మ్యూజియంలో కొండా వెంకటప్పయ్య పంతులు ఆవిష్కరించారు.
త్రివర్ణ పతాక రూపశిల్పికి అనుకున్నంతగా రాని గుర్తింపు !
పింగళి వెంకయ్య లాంటి మహానీయుల కు ఎలాంటి గుర్తింపు లభించక పోవడానికి మన నేతల ఉదాసీనతే కారణంగా చెప్పవచ్చు. వెంకయ్య చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి. చివరి క్షణాలలో తన భౌతికకాయం పై జాతీయ జెండా ను కప్పి .. కృష్ణ నది వద్దకు తీసుకువెళ్లి, అక్కడ జెండా ను తొలగించి అక్కడఉన్నా రావి చెట్టు పై ఎగర వేయాలని, తర్వాత ఆ చెట్టు క్రింద దహనం చేయాలనేది పింగళి వెంకయ్య చివరి కోరిక. సన్నిహిత బంధువులు ఆయన కోర్కెను నెరవేర్చారు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ దేశానికి ఓ పతాకం ఇచ్చిన అపురూప వ్యక్తిగా చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతారు.