ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం సద్దుమణగలేదు.  ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ సొంతంగా పోరుబాట పట్టాయి. ఈ రోజు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరయ్యారు.  ఉపాధ్యాయ సంఘాల నిరసనలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం అయిందని .. ఉద్యోగుల్లో కొంతమంది ప్రతిపక్షాలతో కలిసి మళ్లీ ఆందోళన బాట పడతామని అంటున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తామంటున్నారు అని సజ్జల అన్నారు. 


వామపక్ష ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పెంచాలి అంటే సాధ్యం అవుతుందా? అని సజ్జల ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వామపక్ష ఉద్యోగ సంఘాలు కేరళలో హెచ్‌ఆర్‌ఏ ఎంత అని ప్రశ్నించారు.  వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల ప్రశ్నించారు.  లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే మంత్రుల కమిటీని వచ్చి కలవొచ్చని సూచించారు. ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలన్నింటితో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.  ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని విజయవాడలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. 


ఉద్యోగ సంఘాల నాయకులు  ఉపాధ్యాయ సంఘాల పై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము మినిట్స్‌పై సంతకం చేయలేదని.. తమను అసలు మాట్లాడనివ్వలేదన్నారు. మహమ్మారి కరొనా  ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నామని స్పష్టం చేశారు.   ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని, స్టీరింగ్‌ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసిన వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే కావడంతో వారు మళ్లీ రోడ్డెక్కితే పరిస్థితి మొదటి కొస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. స్కూళ్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పలు జిల్లాల్లో టీచర్లకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా న్యాయమైన పీఆర్సీ ఇచ్చే వరకూ తాము పోరాడతామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.