Tuni Train Case :    తుని రైలు దహనం కేసులను రైల్వే కోర్టు కొట్టి వేసింది. మొత్తం 41 మంది నిందితుల విషయంలో సరైన సాక్ష్యాలను చూపించడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారు. సరిగ్గా విచారణ చేయని ముగ్గురు రైల్వే పోలీసులపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు.  ఈ ఘటన విషయంలో  ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదని రైల్వే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  సున్నితమైన అంశాన్ని ఐదేళ్ళపాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించారు.  ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని.. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని వ్యాఖ్యానించింది.  ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని కోర్టు స్పష్టం చేసి కేసులను కొట్టి వేసింది.  ఈ కేసులో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా  పలువురు కీలక నేతలు నిందితులుగా ఉన్నారు. వీరంతా కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నారు. 

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో రైలును తగులబెట్టిన ఆందోళనకారులు

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కాపులు పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడ  అల్లర్లు చెలరేగాయి. విధ్వంస కాండ నెలకొంది.  విశాఖ వైపు వెళ్తున్న  రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్ పై దుండగులు దాడి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ తీసుకు వచ్చి తగులుబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఈ ఘటనకు సంబంధించి అదే సమయంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు దహనం అయ్యాయి. తుని రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ పలు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ కేసులో రైల్వే పోలీసులు మొత్తం 41 మందిపై కేసులు పెట్టారు. 18 మంది పోలీసు అధికారుల సాక్షాలు,  ఆనాటి రైలులో ఉన్న ప్యాసెంజర్ల సాక్ష్యాలను రైల్వే కోర్టు నమోదు చేసింది. చివరికి సాక్ష్యాలు లేవని.. పోలీసులు సరైన విచారణ చేయలేదని తేల్చి కేసును కొట్టి వేసింది. 

ఊపిరి పీల్చుకున్న కీలక నేతలు 

ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వారందరూ కేసు నుంచి బయట పడినట్లయింది.   ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఇప్పటికే ఎత్తివేత !   కాపుల బహిరంగ సభ సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో జరిగిన విధ్వంసానికి అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు 329 కేసులు పలు సెక్షన్లు కింద నమోదు చేశారు.  ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 2016 నుంచి 2019 వరకు జరిగిన దర్యాప్తులో 153 కేసులు వరకు వీగిపోయాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 176 కేసులుకు 161 కేసులను వెనక్కు తీసుకుంది. 14 కేసులు మాత్రం కోర్టులో విచారణ కొనసాగుతోంది.  వైసీపీ ప్రభుత్వం 161 కేసులు వరకు ఎత్తివేసినా  కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబందించిన కేసులు పలు సెక్షన్లు కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయగా ఈ కేసులు విచారణ చేశారు. 

అయితే ప్రయాణికుల భద్రతతో ముడిపడిన వ్యవహారం విషయంలో నిందితులు ఎవరో తేల్చకపోవడం.. అందర్నీ నిర్దోషులుగా విడుదల చేయడంతో మరి అసలు రైలుని ఎవరు తగలబెట్టారన్న ప్రశ్న వస్తోంది.