Andhra News :    జీవో నెంబర్ 1  ప్రాథమిక  హక్కుల ఉల్లంఘన కు పాల్పడేలా ఉందని  హైకోర్టు కొట్టి వేయడంపై విపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.   "న్యాయస్థానం న్యాయమే చేసింది" ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల నినదించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని సోము వీర్రాజు స్పందించారు.   ప్రభుత్వ ఆంక్షలు ఫలితంగా ప్రజా ఉద్యమాలు నిర్వీర్యం అవుతున్న తరుణంలో జీఓ నెం.1 విషయంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 


 





 
ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసిందని..  ఫ్యాక్ష‌న్ పాల‌న‌పై ప్ర‌జాస్వామ్యం గెలిచిందని నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు.  రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్ల‌దంటూ అంబేద్క‌ర్ రాజ్యాంగం నిరూపించిందన్నారు. 


 





 


ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్న జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూన్నాననని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు తెచ్చారన్నారు.  


హైకోర్టులో జీవో నెం.1 కొట్టివేతపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పిచ్చి కుక్క కాటుకి ఆలస్యంగానైన చెప్పు దెబ్బ తగిలిందన్నారు. ఇకనుంచైనా ప్రభుత్వం తింగరి వేషాలు మానెయ్యాలని సూచించారు. ఈ మధ్య కాలంలో ఎన్ని అరాచకాలు చేశారోనని, మరో సీఎం ఉంటే ఈపాటికే రాజీనామా చేసేవారని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. 


జీవో నెంబర్ 1పై హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే ? 


 జీవో నెం.1   జీవో ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని న్యాయస్థానం పేర్కొంటూ కొట్టి వేసింది.  రాష్ట్రంలో సభలు, రోడ్‌షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చింది. ఈ జీవోను సీపీఐ నేత రామకృష్ణ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణ తరపున లాయర్‌ అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో తెచ్చారని, పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ మేరకు జీవో నెం.1ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.