YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేక హత్య కేసు విచారణలో సీబీఐ మరో బాంబు పేల్చింది. శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో విషయంలో కీలక అంశాలు వెల్లడించింది. మరోసారి అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించింది కేంద్రదర్యాప్తు సంస్థ. ముగ్గురు కలిసి సాక్ష్యాలు ధ్వంసం చేశారని తెలిపింది. హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నాడని వెల్లడించింది. గూగుల్ టేక్ అవుట్‌లో లొకేషన్‌కి సంబంధించిన ఆధారాలు లభించినట్టు పేర్కొంది. వివేక చనిపోయారని మూడో వ్యక్తి ద్వారా తెలిసిన తర్వాతే బయటకు వచ్చారని వివరించింది. విషయం తెలుసుకున్న రెండు నిమిషాలకే వివేక ఇంటికి అవినాష్, ఉదయ్, శివశంకర్ రెడ్డి చేరుకున్నారని వెల్లడించింది. ఆయనకు అన్నీ తెలిసని అనుమానం వ్యక్తం చేసింది. సాక్ష్యాల తారుమారులో ఈ ముగ్గురి హస్తం ఉందని కూడా తెలిపింది.
వివేకాది గుండెపోటుగా చిత్రీకరించడంలో కీలక పాత్ర
హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు.. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందని సీబీఐ స్పష్టం చేసింది. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేక మృతదేహానికి కుట్లు వేయించారని.. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా చనిపోయాడు అని తెలిసే వరకు ఇంట్లోనే ఉన్నారని... వివేక మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారన్నారు. బాత్రూం నుండి డెడ్ బాడీని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని .. వివేక తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకానంద రెడ్డి గుండెపోటు అనే చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని సీబీఐ స్పష్టం చేసింది.
కుట్ర పూరితంగానే మొత్తం వ్యవహారం
గాయాలు కనపడకుండా ఉండేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని సంప్రదించి కుట్లు వేయించారని.. చనిపోయిన వివేకా తలకు ప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ వేశాడని తెలిపింది. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన తమ విచారణకు సహకరించడం లేదని.. పారిపోతాడనేటువంటి అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశామని సీబీై తెలిపింది. ఇంకా ఈ కేసులో విచారణ చేస్తున్నామని.. మరి కొంతమందిని కూడా అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది.
మరిన్ని అరెస్టులు ఉంటాయన్న సీబీఐ
ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోని అంశాలు గతంలో కన్నా మరింత సూటిగా ఉన్నాయి. నేరుగా పకడ్బందీగా హత్య చేసిన తర్వాత వీరు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని సీబీఐ స్పష్టంగా చెప్పినట్లయింది. అంటే హత్యలో వీరి పాత్ర కీలకమని చెప్పినట్లయిందని భావిస్తున్నారు. అదే సమయంలో మరికొన్ని అరెస్టులు కూడా ఖాయమని సీబీఐ తేల్చి చెప్పడంతో.. తదుపరి ఎవరు అరెస్టు అవుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.