ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నుంచి  ప్రయోగాత్మకంగా చేపట్టాలనుకున్న రేషన్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేసే పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో వాయిదా వేస్తున్నామని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయవద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రభుత్వం  రేషన్ బియ్యానికి కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. రేష‌న్ బియ్యం వ‌ద్దనుకునేవారికి ఆ బియ్యం  ఖ‌రీదు మొత్తాన్ని న‌గ‌దు రూపంలో అంద‌జేస్తామ‌ని ప్రకటించారు.  ఇప్పటికే రేషన్ బియ్యానికి నగదు బదిలీ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


అవసరమైన విధంగా లబ్ధిదారుల నుంచి అనుమతులు తీసుకోవడం, వారితో సంతకాలు పెట్టించుకోవడం వంటి పనులన్నీ ఈ నెల 25 వ తేదీలోపు పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు గిరిజా శంకర్‌ సర్క్యులర్‌ జారీచేశారు. వాలంటీర్లు మొబైల్‌ యాప్‌ను వినియోగించి నగదు బదిలీ వల్ల కలిగే ఉపయోగాలను లబ్ధిదారులకు వినిపించాల్సి ఉంటుంది. అనంతరం లబ్ధిదారుల నుంచి వ్యక్తిగతంగా అంగీకారపత్రంపై సంతకం తీసుకోవాల్సి ఉంది. 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ వాలంటీర్లు కార్డుదారులను కలిసి వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు వాలంటీర్లు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో లబ్దిదారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. 


తొలి దశలో ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలైన విశాఖపట్నం కార్పొరేషన్‌ పరిధిలో గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల మున్సిపాలిటీల్లో అమలు చేయాలని ఏర్పాట్లు చేసారు.  ప్రభుత్వం స్వచ్చందం అని చెప్పినప్పటికీ నర్సాపురంలో వంద శాతం అంగీకార పత్రాలు తీసుకోవాలని అదికారులు కింది స్థాయి సిబ్బందిని, వాలంటీర్లను హెచ్చరించడం కలకలం రేపింది. విపక్షాలు కూడా ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల పేదల ఆకలి చావులు పెరుగుతాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పథకాన్ని తాత్కలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే నగదు బదిలీ పథకం అమలుకు చర్యలు తీసుకంటున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. చండీఘర్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలిలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. కేజీ బియ్యానికి ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టత రాకపోవడం ... ఎక్కువ మంది లబ్దిదారులు బియ్యం తీసుకోవడానికే ఆసక్తి చూపడంతో తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  మళ్లీ ఎప్పటి నుంచి నగదు బదిలీకి సన్నాహాలు ప్రారంభిస్తారన్నదానిపై  స్పష్టత లేదు.