Venkaiah Naidu On NTR : ఎన్టీఆర్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అందరినీ నమ్మేవారని, అందుకే వెన్నుపోటుకు గురయ్యారన్నారు. శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఒక కొత్త విప్లవం సృష్టించారు ఎన్టీఆర్ అని వెంకయ్య గుర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయాలలో ప్రధాన స్థానం కల్పించారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి అన్నారు. సిద్ధాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని వెంకయ్య నాయుడు అన్నారు. ఉచితాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలన్నారు. నేటి సమాజంలో అశాంతి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రస్తుత తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానన్న ఆయన.. కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదన్నారు.  కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయాని వెంకయ్య అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ భోళా మనిషి అని, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని తెలిపారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారని వ్యాఖ్యానించారు. కొందరిని ఎన్టీఆర్ బాగా నమ్మారని, ఆగస్టు సంక్షోభంలో వాళ్లే ముందుండి నడిపారన్నారు.

  






ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవం తెచ్చారు


"జై ఆంధ్ర ఉద్యమం నుంచి తెనాలితో నాకు అనుబంధం ఉంది. తరచుగా తెనాలి వచ్చే వాడిని ఉద్యమంలో పాల్గొనేవాడిని. తెనాలిలో జనం, భోజనం రెండూ బాగుంటాయి. సమాజంలో అశాంతి పెరుగుతోంది. మనుషుల్లో అశాంతి పెరుగుతుంది. ఎంతో తెలియడంలేదు. జనం బిజీ అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు కూడా ఒక కారణం. శాంతిని పొందాలంటే ప్రకృతితో కలిసి జీవించాలి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషం. రామారావుకు పోటీ, సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు. ఆయన చారిత్రక పురుషుడు. సినిమారంగంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. రాజకీయరంగంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తీసుకొచ్చారు. బలహీన, బడుగు వర్గాలకు చేయూత నిచ్చారు. వెనుకబడిన, పేద వర్గాలకు పెద్దపీట వేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ పథకాలు రూపకల్పనలో ఆయన పాటు నేను ఉన్నాను. చెన్నైలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఎన్టీఆర్ చర్చించేవారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారికి అభ్యున్నతికి సహకరించారు. మహిళలను రాజకీయంగా ఒక మెట్టు ఎక్కించారు ఎన్టీఆర్. "