Ten percent of AP bar licenses will be allocated to Geetha workers: సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో నూతన బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బార్ పాలసీ ఉంటుందన్నారు. ఆల్కహాల్ తక్కువ ఉన్న మద్యం విక్రయాలతో నష్టం తగ్గించవచ్చని చెప్పారు. బార్ల కేటాయింపులోనూ గీత వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే మద్యం దుకాణాల్లో పది శాతం గీత కార్మికులకు రిజర్వ్                 

ఇప్పటికే మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లను కల్పించారు.  రాష్ట్రంలోని 3,736 మద్యం షాపులలో 10 శాతం అంటే 340 షాపులు గీత కార్మిక వర్గాలకు  తాటి కల్లు సేకరణ వృత్తిలో ఉన్నవారికి కేటాయించారు.  సామాజిక న్యాయం , ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నారు.  ఈ షాపుల కేటాయింపు పారదర్శకంగా ఆన్‌లైన్ లాటరీ విధానం ద్వారా  జరిగింది.   రాష్ట్రంలో 3,736 షాపులలో 3,396 ఓపెన్ కేటగిరీలో, 340 గీత కార్మికులకు, 12 ప్రీమియం షాపులుగా వర్గీకరించారు.              

బార్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలే ఫైనల్          

ప్రస్తుత పాలసీలో ఏపీలో 840 స్టాండ్‌లోన్ బార్లు, 50 స్టార్ హోటల్స్, మైక్రోబ్రూరీస్ లాంటి సంస్థలకు లైసెన్సులు ఉన్నాయి.  అలాగే 44 బార్ లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ కాలేదు.  ఇరుగు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళల బార్ విధానాలపై  అధ్యయనం చేస్తున్నారు.  ఏపీ వైన్స్ డీలర్లు, స్టార్ హోటళ్ల అసోసియేషన్‌లు, హోటల్ యజమానుల సమాఖ్యల నుంచి వచ్చిన వినతులను  సబ్ కమిటీ పరిశీలించనుంది.                              

గీత కార్మికులకు తక్కువ లైసెన్స్ ఫీజు    

వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహించింది. కానీ బార్లను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సు ఇచ్చింది.   2022లో వేలం నిర్వహించి బార్లు కేటాయించే విధానం తీసుకొచ్చింది.   అప్పట్లో రూ.50 లక్షలు, రూ.35 లక్షలు, రూ.15 లక్షలతో మూడు శ్లాబులతో బార్‌ పాలసీ ప్రకటించారు.  వేలం నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి బార్ లైసెన్సులు ఇచ్చారు. మాములుగా అయితే బార్ లైసెన్సులు రెన్యువల్ అవుతూ వస్తున్నాయి. అప్పట్లో రూ.15 లక్షల కనీస ధర ఉన్న బార్‌ను రూ.70 లక్షల వరకు.. రూ.35 లక్షల బార్‌ను రూ.కోటికి పైగా పాడి వేలంలో దక్కించుకున్నారు. కానీ అంతంత ఎక్కువ ఫీజులతో వ్యాపారంలో నష్టం రావడంతో అనేక మంది మధ్యలోనే లైసెన్సులు వదిలేసుకోవడంతో 50కిపైగా బార్లు మూతబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కల్లు గీత కార్మికులకు కేటాయించే బార్ల లైసెన్స్ ఫీజును తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.