standup comidian Sarat Uday | బెంగళూరు: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం చెలరేగింది.  రెండేళ్ల కిందట చంద్రబాబుపై చేసిన జోకుల విషయంలో టీడీపీ మద్దతుదారులు స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రోగ్రామ్ అడ్డుకుని మరీ మరోసారి క్షమాపణ చెప్పించారు. అందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బూతులు తిడుతూ టీడీపీ సానుభూతిపరులు చేసిన చర్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Continues below advertisement

అసలేం జరిగిందంటే..శనివారం, ఏప్రిల్ 25న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కోరమంగళలో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రోగ్రామ్ జరిగింది. స్టేజీ ఎక్కిన అతను అందర్నీ నవ్వుతూ పలకరించాడు. చంద్రబాబుపై రెండేళ్ల క్రితం చేసిన జోకుల విషయంలో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన మద్దతుదారులు బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్నారు.  ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ప్రేక్షకుల మధ్యలోంచి ఓ వ్యక్తి లేచి అతడి వద్దకు వచ్చిన ‘నేను మీకు అభిమానిని. మీరు కామెడీ చాలా బాగా చేస్తారు. కానీ ఒక షోలో మీరు మా నాయకుడిని అవమానించారు. ’ అని అనడంతో షాకవడం శరత్ ఉదయ్ వంతు అయింది.

చంద్రబాబుపై, నారా లోకేష్‌లపై చేసిన జోక్‌లపై తాను గతంలోనే క్షమాపణలు కోరానని చెప్పినా టీడీపీ సపోర్టర్స్ బూతులు తిడుతూ శరత్ ఉదయ్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. నక్సలైట్లు హత్యాయత్నం చేస్తే జోకులు వేస్తావా, లడ్డూపై జోకులు వేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాస్త శృతిమించి అసభ్యకర పదజాలం వాడుతూ స్టాండప్ కమెడియన్‌తో అనుచితంగా ప్రవర్తించారు. శరత్ ఉదయ్‌తో మరోసారి బహిరంగంగా క్షమాపణలు చెప్పించారు. ఈ తతంగం మొత్తం ఉదంతం వీడియోలో రికార్డ్ అయింది.

‘చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి క్షమాపణలు చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా క్షమాపణ కోరుతున్నానని’ వీడియో రికార్డింగ్‌లో శరత్ ఉదయ్ మరోసారి సారీ చెప్పారు. అంతటితో ఆగకుండా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనాలని అతడిపై టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి పెంచారు. చేసిన వ్యాఖ్యలపై తప్పిదానికి క్షమాపణ చెబుతా కానీ, మీ పార్టీకి, నేతకు జై కొట్టాలని ఎలా అడుగుతారని.. తాను వైసీపీ నేతలపై సైతం జోక్స్ వేశానని శరత్ ఉదయ్ గుర్తుచేశాడు. మరోసారి జాగ్రత్తగా మాట్లాడాలని అతడికి వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. 

సారీ చెప్పాను కదా.. ఇక నా షో నుంచి వెళ్లిపోండి అని టీడీపీ మద్దతుదారులకు అతడు సూచించగా.. టికెట్ డబ్బులు తిరిగిస్తావా అని వాళ్లు అడిగారు. మీ డబ్బులు తిరిగిచ్చేస్తా, మొత్తం ఎంత మంది వచ్చారని అడగగా 10 మంది వచ్చామన్నారు. వారికి పేమెంట్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని మరోసారి చంద్రబాబు, నారా లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.