Chandrababu Naidu About YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ ఉంటే అక్కడ శని అని, జగన్ ఓ ఐరెన్ లెగ్ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. జగన్ సీఎం పదవికి  ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది, ఇకపై జగన్ జన్మలో ఆ పదవిలో కూర్చోరని విమర్శలు గుప్పించారు. జగన్ ను చూసి విశాఖ వాసులు భయభ్రాంతులకు గురి అవుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్యలాంటి సస్పెన్స్ క్రైమ్ సినిమాను ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. ఈ హత్య కేసు లాయర్లకు, ప్రపంచంలోని పోలీసు అధికారులు అందరికీ ఓ కేస్ స్టడీగా మిగిలి పోతుందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో నిందితులు ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరించారని బాబు అన్నారు. వివేకాను గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు గుప్పించారు. అడ్డొచ్చిన వారందరినీ చంపేస్తారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రౌడీలు, గుండాల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. తన తండ్రిని చంపిన హంతకులు ఎవరో తెలుసుకునేందుకు వైఎస్ వివేకా కుమార్తె పోరాడుతున్నారని చంద్రబాబు అన్నారు.


కార్యకర్తల వెంటే పార్టీ


కార్యకర్తలే టీడీపీ పార్టీకి బలమని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీదే అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా.. పార్టీ ఎప్పుడూ అండగా, మద్దతుగా ఉంటుందని భరోసా నింపారు. పార్టీ కార్యకర్తల కోసమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పెట్టామని, కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకుంటున్నామని బాబు తెలిపారు. రూ. 5 వేలు విరాళం ఇచ్చిన వారికి జీవిత కాల సభ్యం ఉంటుందని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల ఎందరో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని, అలాంటి వారు పార్టీకి విరాళాలు ఇవ్వాలని బాబు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పార్టీ కేవలం సిద్ధాంతాలను వల్లెవేయదని, వాటిని పాటించి చూపిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 


మూడ్రోజుల పాటు జనంతో మమేకం


తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. సాయంత్రం సమయంలో గిద్దలూరు చేరుకున్న బాబు.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుండి మర్కాపురం చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం బాబు జన్మదినం సందర్భంగా చిన్నారులు, మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అక్కడి నుండి సాయంత్రం వేళ మర్కాపురం పట్టణానికి వెళ్తారు. అక్కడ రోడ్ షో అనంతరం స్థానిక ఎస్వీకేపీ కాలేజీలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గురు వారం రాత్రి మర్కాపురంలోనే చంద్రబాబు బస చేస్తారు. 21వ తేదీ శుక్రవారం ఉదయం రైతులతో బాబు సమావేశం ఉంటుంది. సాయంత్రానికి అక్కడి నుండి యర్రగొండ పాలెం బయల్దేరి వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ కు బయల్దేరతారు.