మ‌హానాడు.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వ‌చ్చేది తెలుగు దేశం పార్టీ. టీడీపీ ప‌రంగా ప్రజ‌ల్లోకి వెళ్ళేందుకు, పార్టీ దశాబ్దాలుగా రాణించేందుకు మ‌హానాడు అత్యంత కీల‌కంగా వ్యవ‌హ‌రించింది. మ‌హానాడు వేదిక‌గా మూడు రోజుల పాటు ఆ పార్టీ నాయ‌కులు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా జ‌రిగే పార్టీ పండుగ మ‌హానాడు రాను రాను కుంచించుకుపోతోంది. ఇందుకు కార‌ణం ఏంటి? ప‌రిస్థితుల ప్రభావ‌మా లేక‌.. మార్పు అనివార్యం అయ్యిందా.. అనే చ‌ర్చ పార్టీ నాయ‌కుల్లో వ్యక్తం అవుతుంది.


టీడీపీ.. మ‌హనాడు.. ఈ రెండింటికీ చాలా క్లోజ్ రిలేష‌న్ ఉంది. ప్రతి ఏటా టీడీపీ నిర్వహించే మ‌హానాడుకు చరిత్ర చాలా ఉంది. నంద‌మూరి తార‌క రామారావు ఆరంభించిన మ‌హనాడును నేటికి ఆ పార్టీ ప్రతి ఏటా కొన‌సాగిస్తుంది. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల‌తో పార్టీ కార్యక‌ర్తల నుండి అధినేత వ‌ర‌కు అంతా క‌ల‌సి తీర్మానాలు ఆమోదించుకోవ‌టం ఆనవాయితీ. అయితే రాను రాను మ‌హానాడు వేదిక రూపు రేఖ‌లు మారిపోతున్నాయి. ఇందుకు కార‌ణాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా క‌రోనా కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్సరాలుగా మ‌హానాడు కార్యక్రమాన్ని టీడీపీ ఆన్ లైన్ లోనే నిర్వహించింది. ఇప్పుడు క‌రోనా నుండి కోలుకున్న త‌రువాత మ‌హానాడును భారీగా నిర్వహించాల‌ని పార్టీ నేత‌లు భావించారు. 


అయితే ఉన్న ప‌ళంగా ఎందుక‌నో కాని మ‌హానాడు స‌మ‌యాన్ని పెద్ద ఎత్తున కుదించారు. ఒంగోలులో 3 రోజుల పాటు మ‌హానాడును నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఆ త‌రువాత కేవ‌లం ఒక్క రోజు మాత్రమే నిర్వహించాల‌ని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. 27న 5 వేలలోపు ప్రతినిధులతో ఒంగోలు శివారులో ఒక్కరోజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, 28న మహానాడు నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ ముఖ్య నేత‌లు చెబుతున్నారు. సభలోనే ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్ని ప్రారంభించి, ఏడాది పాటు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా మే 27 నుంచి 29 వరకు నిర్వహించడం ఆనవాయితీ.


అయితే, ఈ సారి ఇంత భారీగా మార్పులు చేయ‌టం వెనుక కార‌ణాలు అనేకం ఉన్నాయ‌ని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జ‌రుగుతుంది. అయితే ప్రస్తుత రాజ‌కీయ ప‌రిస్దితులు నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి దీటుగా, ఏడాది పాటు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి, రాజ‌కీయంగా ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ కావాల‌ని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అధికార పక్షంపై తిరుగుబాటు జెండా ఎగ‌రేసిన చంద్రబాబు, తిరిగి సీఎం అయ్యి స‌భ‌లో అడుగు పెడ‌తాన‌ని స‌వాల్ విసిరారు. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు సంవ‌త్సరాల పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా దూకుడు ప్రద‌ర్శించేందుకు మ‌హానాడును వేదిక‌గా చేసుకొని తెలుగు త‌మ్ముళ్ళు ముందుకు వెళ్ళాల‌ని అధినేత వేసిన ప్లాన్ గా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది.