ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నిరుద్యోగంపై తెలుగుదేశం పార్టీ (Telugudesam party) జాతీయ ప్రధాన కార్యదర్శి (National General secratary) నారా లోకేశ్ ( Nara Lokesh )ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే, ఏపీలోనే అత్యధికంగా నిరుద్యోగిత రేటు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరగటం భాధాకరమంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఉద్యోగ - ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్ నిరంకుశత్వం కారణంగా యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని లోకేష్ ట్వీట్ చేశారు.
3వేల కిలోమీటర్లు పూర్తి, పైలాన్ ఆవిష్కరణ
నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లోకేశ్‌తో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ కొంతసేపు పాదయాత్ర చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవ్వరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు నారా లోకేశ్. హక్కుల కోసం పోరాడినవారిపై దొంగ కేసులు పెడుతోందని, రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందన్నారు. మూడు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని నారా లోకేశ్ అన్నారు. జగన్ నీకింత.. నాకెంత అని అడిగితే మాకు వద్దంటూ పరిశ్రమల యజమానులు పారిపోయారని ఆరోపించారు.
10 ఉమ్మడి జిల్లాలు...92 నియోజకవర్గాల మీదుగా
జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర... పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. మర్నాడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు. యువగళం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ యువనేత లోకేశ్‌కు ఎరుపు రంగు టీషర్టు ధరించిన 100 మంది వాలంటీర్లే రక్షణ కవచంగా నిలిచారు. వివిధ జిల్లాలకు చెందిన వీరంతా బీటెక్, డిగ్రీ పీజీలు చేసిన యువకులు. రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రవినాయుడు పర్యవేక్షణలో సేవలందిస్తున్నారు.