Mohan Babu :  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి  సినీనటుడు  మోహన్ బాబు యూనివర్శిటీ అధినేత మోహన్ బాబును తిరుపతిలో కలిశారు. తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. సమావేశం మర్యాదపూర్వకంగానే జరిగిందని.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఆధునిక వసతులు తో విద్యా రంగం అభివృద్ధి కి దోహద పడేలా విద్య బోధన జరగడం మంచి పరిణామం.లైబ్రరీ మరియు ఇతర వసతులు ఎంపీయూలో బాగున్నాయని కితాబిచ్చారు. 


 





 
గత ఎన్నికలకు ముందు అంటే 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు రోడ్డెక్కారు. ఈ నిరసనలో ఆయన కుమారులు ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆ పార్టీకి ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ కి సపోర్టుగా లేరు .ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా మోహన్ బాబు.. వైసీపీకి మద్దతుగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అదే సమయంలో తాను బీజేపీ మనిషినని గతంలో ప్రకటించుకోవడంతో..  తమకు మద్దతివ్వాలని బీజేపీ నేత సోము వీర్రాజు ఆయనను కలిశారు. అయితే బీజేపీకి కూడా మోహన్ బాబు బహిరంగంగా మద్దతు తెలియచేయలేదు.                             


కొద్ది రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఆ సమావేశం ఎందుకో అన్నదానిపై స్పష్టత లేదు. కానీ తన విద్యా సంస్థ సమీపంలో ఆయన నిర్మించిన సాయిబాబా ఆలయం  ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని చెప్పుకున్నారు. అయితే ఆ ప్రారంభోత్సవానికి చంద్రబాబు వెళ్లలేదు.                                            



విద్యానికేతన్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మోహన్ బాబు..  వాటిని యూనివర్శిటీగా మార్చారు. తన పేరు మీద తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వాటిలో ప్రపంచస్థాయి విద్యా సౌకర్యాలు కల్పించామని చెబుతున్నారు. ఈ యూనివర్శిటీని పలువురు సందర్శిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించినందున పాత పరిచయాలతో తెలుగుదేశం నేతలు కూడా ఎంపీయూని సందర్శిస్తున్నారు.